పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, ఆగస్టు 2012, ఆదివారం

స్వాతీ శ్రీపాద // కలకాదు //

చూసి చూసి
చీకటి కళ్ళల్లో కూరుకుని
కన్నీటి వాన నా చుట్టూ
ఇనప కడ్డీలుగా పాతేసుకుని
నిస్తేజాన్ని పరచుకు ఒత్తిగిలాను

లీలగా అలవోక స్వప్నావిష్కరణలా
నీ అడుగులసడి
అనునయం వసంతాన్ని నింపుకున్న నీ స్వరం
నా ఉనికి సర్వస్వానీ వశీకరించుకుని
ఒక యుగం
ఉలిపిరి పరదా వెనక ప్రతి లిప్తనూ
మనసారా అనుభూతించాక

ఒళ్ళు విరుచుకుంటూ మెళుకువ
కనురెప్పలను విడదీసేవేళ
దూరంగా నిష్క్రమిస్తూ నీ నీడ
కల కాదు
ఇదిగో నా చెక్కిలిపై నీ ఓదార్పు
చిరు చెమరింపు.

25/08/12

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి