ప్రేమకాంతి నా రోజుల్ని వెలిగిస్తున్న ఒక సాయంత్రం ఆమె అడిగింది
నేను మీకు అబద్దాలు చెప్పాననీ, మిమ్మల్ని మోసం చేసాననీ
మీకు అనిపించిన రోజున ఏమి చేస్తారు, నాపై కోపం వస్తుందా
నా చివరి సాయంత్రపు, చివరి బంగారు కిరణాలు
నన్ను చీకటికి అప్పగించి సెలవుతీసుకొంటున్నాయి
పరుచుకొంటున్న ప్రశాంత నిశ్శబ్దంలో ఒక పిట్ట కూసినట్టు
ఊహించనివైపు నుండి నాలో వాలిన మౌనంలోంచి ఒక్కొక్క మాట ఆమెతో అన్నాను
లేదు, నీపైన ఎప్పటికీ కోపం రాదు
నిజానికి కొన్ని తప్త క్షణాల్లో నిన్ను నా సహచరిగా భావించినా
నువ్వు ఎపుడూ నాకొక పసిపాపలా కనిపిస్తావు
నీ నిర్మలమైన చిరునవ్వు నన్ను ప్రాభాతకాంతిలా ఎన్నోసార్లు దు:ఖవిముక్తిడిని చేసింది
నీ చుట్టూ వలయం తిరిగి తాకిన చిరుగాలులు చల్లని నదీజలాల్లా తేలిక చేసాయి
నీ మాటలూ, వాటిమధ్య మౌనమూ నను రోదసిలో విహరించే అన్వేషిని చేసాయి
నా పేలవమైన సమయాలను నీ రూపం గొప్పదిగుల్లోకి పుష్పించేలా చేసింది
నీ పట్ల నాకు కృతజ్ఞత ఉంది
జీవితం నాకు ఇచ్చిన అన్ని కానుకలలోకీ గొప్ప కానుకవి నువ్వు
కానీ, ఒకటి చెప్పగలను, నువు నన్ను విడిచేరొజు సమీపించేకొలదీ
నీకు నేను, మరిచిపోలేని, విడిచిపెట్టలేని అపురూపమైన కానుకనవుతాను
నన్ను విడిచివెళ్ళిన దు:ఖం నీ జీవితమంతా పరుచుకొంటుంది
ఆమె అంది, ఇది తీయని ప్రతీకారం
ఆమె చల్లని నవ్వుపై చీకట్లు వాలుతున్నాయి
నాలో తీయగానైనా ప్రతీకారకాంక్ష ఉందో, లేదో నాలోపల ఒకరికి తెలుసు
నాకు తెలుసు, ఆమె ఎక్కడ ఉన్నా నా మనిషి,
ఆమే, నేనూ వేరుకావటం ఆమె భ్రమ మాత్రమే అని
ఆమె వల్ల నేను ఏయే విశాల విశ్వాలకి మేలుకొన్నానో, విస్తరించానో
ఆమెకి తెలియదు ఇంకా, తానొక పసిపిల్ల కదా
జీవితం ఒక మొరటుస్పర్శ చాలాసార్లు
తాను నానుండి వెళ్ళిపోయాక ఆమెని జీవితమెలా లోబరుచుకొంటుందో నాకు తెలుసు
ఎందరిని చూడలేదు, కేవలం ధూళిలా, రాలిపోయిన పూలలా బ్రతుకుతున్నవాళ్ళని
ఆమెలో నేనొక మరువలేని సంతోషం మిగిల్చే మరువలేని దు:ఖాన్ని ప్రవేశపెట్టకపోతే
ఆమె జీవితం మాయలో ఎలా దారితప్పుతుందో
ఎలా వెలిసిపోయిన చిత్రపటంలా మిగులుతుందో నాకు తెలుసు, ఆమె ఒక పసిపిల్ల కదా
చీకటి ముసురుకొంది
చీకటి కన్నులు చెమరించినట్లు నక్షత్రాలు ఒక్కొక్కటీ మెరుస్తున్నాయి
అవి చిన్నిచిన్ని చినుకులు కావనీ, ఒక్కొక్కటీ నా జీవితం పట్టనంత కాంతిలోకాలనీ
నా కన్నులనుండి జారేందుకు వెనుకాడుతున్న కన్నీటిబిందువు చెప్పింది
ఆమె వెళ్ళిపోయింది, నువ్వైనా నాతో ఉండవా అనబోతున్నానని ఆ బిందువుకి తెలిసినట్లుంది
ఆమె ఉంటే జీవితం ఎలా ఉండేదో తెలియదు కాని
ఆమెలేని దిగులు నన్ను మరింత దయలోకీ, కాంతిలోకీ నడిపించింది
తన వెలితిని నింపుకొనేందుకు అప్పటినుండీ విరామమెరుగక వికసిస్తూనే ఉన్నాను
ఆమె ఎక్కడ ఉందో, ఎలా ఉందో చూడాలని చాలాసార్లు అనిపిస్తుంది
అప్పుడు
పూలపై వాలిన మంచుబిందువులూ, పక్షుల రవాలూ, సెలయేటిపరుగూ,
మనుషుల చిరునవ్వులూ, దు:ఖితులపై ఎవరోఒకరు కురిపించే దయా
లోకం నన్నుతాకే మృదువైన సమయాలన్నీ ఆమె మాలో లేదా అని నవ్వుతాయి
24.8.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి