కొన్ని స్నేహాలూ అంతే!
రెక్కలొచ్చాయని తెలిసేలోపే
ఆకాశాలవైపు ఎగరేసుకుపోతాయ్.
గూడు కట్టాలని గుర్తొచ్చేలోపు
కనపడని గుర్తేదో ముద్రించిపోతాయ్.
మొదట- ఎందుకో అడగొద్దంటూ
కొండకోనలు,వాగువంకలు తిప్పుకొస్తాయ్.
ఏ పనీ లేనందుకు
నువ్వు మౌనంగా వెళ్ళిపోవాలి.
ఆపై- ఎవరికీ చెప్పొద్దంటూ
రెక్కలెలా విప్పుకోవాలో,పూలనెలా గుర్తుపట్టాలో నేర్పిస్తాయ్.
ఏ తెలివీ లేనందుకు
నువ్వు సడిచేయకుండా అనుసరించాలి.
పచ్చని చెట్ల రంగుని,దూరపు కొండల ఎత్తుని,
పూసేపూల అందాన్ని,అవి చెప్తేనే తెలుసుకోవాలి.
వాలుగా కురిసేది వాననీ,వాగులో పారేది నీరనీ,
వచ్చిపోయేది గాలనీ,నేర్పగా నేర్చుకోవాలి.
చెట్టుకాస్తే పండ్లు పైనే ఉండాలనీ
చేనుపండితే గింజలు కిందే రాలాలనీ కోరుకోవాలి.
ఆకురాలేముందు వసంతాలకీ
పూతరాలేముందు పూర్వాహ్నాలకీ వలసపోవాలి.
పొద్దుటి పూట వెలుగనీ,సాయంకాలం చీకటనీ
ఎండపూట తిరగొద్దనీ,ఎన్నెల పూట పాడొద్దనీ
నీరు తాగాలనీ, గాలి పీల్చాలనీ,
పువ్వు రాలినట్టు ప్రాణం రాల్చాలనీ,
దేవుడా!
ఆ ఉపదేశాలకి అడ్డూ,అదుపూ ఉండదు.
ఆ నేర్పు ఎన్నటికీ చదవాలనిపించదు.
చివరగా-వచ్చే అజ్ఞానమేమంటే
వయసుతో అనుభవం రాదనీ,
అనుభవిస్తే బతుకు సరిపోదనీ,
నీ బతుకు నువ్వే బతకాలనీ!
నీలాగే నువ్వు చావాలనీ!
ఇంకా బతికే ఉన్నావా?
ఉంటే -ఏమంటావు బుల్‌బుల్?!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి