పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, జూన్ 2014, సోమవారం

Aruna Naradabhatla కవిత

కల _____అరుణ నారధభట్ల సూరీడిని మింగే సముద్రం ఎంత అగ్గిని కడుపులో దాస్తుంది! శ్వేతవర్ణం చుట్టుకున్న జాబిలి మసక చీకట్లను గుండెలో ఎంత ముద్దుగా పొదువుకుంది! ఉబికే లావాను భూమాత ఎంత గుట్టుగా బంధిస్తుంది! శూన్యంతో నిండుకున్న ఆకాశం ఎన్ని పాలపుంతలను మోస్తుంది! మూడొంతులూ పరుచుకున్న నీరూ జాలిగా కాసింత నేలను ప్రాణులకోసం వదిలేసింది! తాను లేనిదే నడవదని తెలిసి గాలి.... ఆగకుండా వీస్తూనే ఉంది! పంచభూతాలు మనిషికి ఎంతటి నిర్వచనం! తల్లి కడుపున వొత్తిగిలి అన్నీ ముందే సమ్మేళనం చేసుకొని పసిముద్దగా బాల్యాన్ని హాయిగా పలకా బలపంతో దిద్ది దారిలో కొనుక్కొచుకున్న పిప్పరమెంట్లా తీయగా మింగేస్తాం! మిసిమిగొలిపే పాలబుగ్గలు ఎరుపెక్కే యవ్వనాలు.... లేత చిగురు పూతకొచ్చినట్టు! పరవళ్ళు తొక్కే గోదారి అగాధ సముద్రంలోకి కలిసి పోతుంది! ఈతకొట్టడం ఇక్కడే మొదలు! మంచినీళ్ళ ఆనవాళ్ళు మచ్చుకైనా కనిపించవు! ఒడ్డున పడే కోర్కెలగుర్రం కాళ్ళు నరికినట్టుగా చతికిలబడుతుంది! చిరునవ్వులతో ఆకాశానికెగసిన పక్షి గుంపొకటి ముసురుకుంటుంది! కూలిన ఆనవాళ్ళను వాసన చూస్తూ! దేహం మౌనంగా కసాయి ప్రేమను చూసి లోలోపల నవ్వుతుంది! నిర్మలత్వం చచ్చుబడ్డ కాళ్ళకు తెలుస్తుంది! అత్తగారింటికి వెళ్ళిన చెల్లి ముఖం కేసి చూస్తూ పెళ్ళికాని అక్క అలిగి...అలిసి లోపలే ముఖం దాచేసుకుంటుంది! మొగ్గ పువ్వవ్వాలనుకోవడం.... పువ్వు రాలిపోవాలనుకోవడం... చిత్రమంతా మనసుదే ఎక్కడా నిలవదు! 16-6-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ovFINV

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి