పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, జూన్ 2014, మంగళవారం

Sriramoju Haragopal కవిత

పాఠశాల అమ్మయింది బడి నాకు చిన్నప్పటిసంది నేను బడిలోనే చదువుకునేటప్పుడయినా, చదువుచెప్పేటపుడైనా బడి నాకు తల్లి కథలు చెప్పిచ్చుకునే ఉపేందర్ గాడు. ఏభై ఏండ్ల తర్వాత కలిసిన కబడ్డిగోస్త్ రంగడు గులేరు కొట్ట నేర్పింది, కోతికొమ్మచ్చి ఆడించింది వాడే మట్టమీద బెల్లమైన బాల్నర్సయ్య మనసుకు మాలిమైన క్రిష్ణగాడు ఆటలల్ల సోపతి మజీద్ గాడు బడికి వస్తపోత ఉప్మ,పాలు కడుపుల విషమైనపుడు పానం కాపాడిన చాకలి రాములమ్మ వొదినె కంచుక పుడితే కాపాడిన కుర్మమల్లమ్మ పెద్దమ్మ కష్టాల్ల ధైర్యం జెప్పిన కాపురామయ్య పెదనాయిన ఆకలై ఏడిసినపుడు కారంకూరైన పెదనాయినమ్మ ఎంత వేదాంతో అంత బతుకుతెలిసిన మనిషి బడికి పొయే తొవ్వల అన్ని అరుగులు అమ్మయినయి బిడ్డ బాగున్నవా అని రోజూ పల్కరించినయి, ఏడ్సుకుంట పోతుంటే వూకుంచినయి పాలు మరిపించాలని ముసాంబ్రం తాపిన అమ్మ బాధ యాదికొస్తే బతుకు అమ్మ పాలకుతే సేపులొచ్చిన ఏ అమ్మని జూసినా అమ్మే యాదికొస్తది చిలికిన చల్లమీద పేరుకున్నవెన్ననా అరచేతుల్ల అమ్మే పాలకంకుల జొన్నకాపిళ్ళు, పజ్జొన్నగట్కల పచ్చెన్నముద్ద అమ్మే వానల్ల తడువకుండ అన్నిండ్లు కొప్పెరయినయి ఎండల దూపకు చల్లటినీళ్ళు దోసిళ్లు నింపినయి ఆటల్ల,పాటల్ల వాగుల వూటచెలిమయింది బడి నవ్వుల్ల, ఏడ్పుల్ల గొడుగుపట్టిన మొగులయింది బడి ఎన్నిదుఃఖాలు వొడగట్టింది బడి ఎన్ని బాధలు వొడిపించింది బడి ఆటలు నేర్పి, పాటలు నేర్పి, మాటలు నేర్పి నన్ను బతికించిన జమ్మిచెట్టు బడి పోతున్న పానం పట్టితెచ్చింది బడే బతుకుప్రాణమైంది బడే కాపుదనపు ఇండ్లల్ల పొద్దుపొడిచి బువ్వచుక్కైంది బడి వాగుల వూరిన వూటచెలిమై మనసుదాహం తీర్చింది బడి సందెవాకిలితీసిన వాకిట్ల వేపచెట్టై ముచ్చట్లాడింది బడి రాత్రంత భయం,చీకటి, నిద్రల్ని కప్పి ఒక్కటే దుప్పటై కాపాడింది బడి ఎంతమంది స్నేహాల్నిచ్చింది బడి ఎంతమంది కన్నకష్టాల్ని చూపింది బడి నన్ను దుఃఖంల, నవ్వుల ఒక్కతీర్గ జూసిన మంచి మనసున్న నేస్తం బడి బడి నాకు నా కన్నీళ్ళ తాళపత్రగ్రంథం బడి నాకు నా మరణాంతర వీలునామా బతుకనేర్పింది బడి బతుకు నేర్పింది బడి

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lLUkVM

Posted by Katta

1 కామెంట్‌:

  1. మీరు పాఠశాలలో ఉన్నప్పుడు దానిని ద్వేషించడం సాధారణమే కాని మీరు వెళ్లిన తర్వాత మీరు తప్పకుండా దాన్ని కోల్పోతారు
    Latest Telugu News

    రిప్లయితొలగించండి