పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, జూన్ 2014, మంగళవారం

Humorist N Humanist Varchaswi కవిత

//వర్చస్వి//ఘనీభవనం// దిక్కులు గజగజలాడేలా తన్నుకొస్తుందనుకున్న నీ స్వరం నీరసంగా దూదిపింజలా తేలిపోతుంది ! తక్షణం జిందాబాదనాలనుకున్న నీ జిహ్వ మరుక్షణం మడిచిపెట్టుకుంటూ ముర్దాబాదంటుంది! ఈ క్షణపు నిజాల్ని నువ్వు జీవించి చూస్తున్నావన్న దాఖలా మది జల్లెడపట్టి చూసినా కానరావు! అదేమిటో ఖర్మ! నీ చుట్టూరా ఘటనల్ని ఎప్పటికీ నీదైన గీతంగా పాడలేవు. నువ్వు మునిగి తేలుతున్న ఘడియల్ని నీ సుశిక్షిత అక్షరాల్లో చూపెట్టలేవు. నీ ముఖ మఖ లో పుట్టిన హుంకారం ఆశ్చర్యంగా నిబ్బరం కోల్పోయి పుబ్బలోనే మాడి పూడుకుపోతుంది ఏదో ఒక ఒడ్డున నిలుపుదామనుకున్న నీ పడవ- నీ తెడ్డు పనికిరాక ఏటో అటు అడ్డదిడ్డంగా సాగి పోతుంది స్వరంలోంచి విరుచుకు పడలేని అర్ధమున్న నీ ఒక్క ముక్కా వ్యర్ధమై నీముందే అసువులు బాస్తుంది. ప్రవాహంలో కొట్టుకుపోతూ ప్రవాహ దిశనే మార్చాలనుకోవడం ఎంతటి తెంపరితనం ? సమకాలీన కాలసలిలం లో నిలువునా మునకేస్తూ కూడా నీదైన చమ్మ, బిందుమాత్రం ప్రకటించలేకకపోవడం ఎంతటి భావ గళ దారిద్ర్యం? ఎటు ఒరిగి పడుకున్నా బాధే అయినపుడు నీ పెడబొబ్బలు మౌనాన్ని తగిలించుకుని అక్కడితో మరణించడం సబబే కదా! ఇపుడు సంతోషంగా విహరించేస్తుందనుకున్న నీ ఆలోచనా విహంగం ఉన్నట్టుండి రెక్కలు కత్తిరించుకుని నెత్తురు కక్కుకుంటూ రాలిపోతుంది తెలీని వేదనో బాధో అయోమయమో ఎత్తుదామనుకున్న నీ గళం లో గరళంగా అడ్డుపడి ఊరుకుంటుంది నీ దారిన నువ్వు ఎగురుకుంటూ పోతున్నా ముళ్ళ కంప ఎగిరొచ్చి నీకు అడ్డుపడొచ్చు నీటైన బాట పరుద్దామనుకున్నా కళ్ళముందే అది నీ మాట వినక పోవచ్చు అవును – ఎంతకాలమని కళ్ళార్పకుండా చూస్తుండగలవ్ ఎన్నిసార్లని నోళ్ళిప్పకుండా పడి ఉండగలవ్ ఊరికే ప్రశ్నలా ప్రవహించకేం సంతృప్తిగా ఘనీభవించు ఉలినవతల పారేసి కేవలం శిలగా వెలిగిపో! /10.06.14/

by Humorist N Humanist Varchaswi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pX6HkX

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి