హిఫాజత్ గ పెట్టు బిడ్డా నేను జీవిస్తున్న కాలం నాదే పరాయితనాలతో పోరాడ్డమే బతుకంతా నేను నేర్చుకున్న యుద్ధవిద్య నా ముందుతరాలవాళ్ళు నాకిచ్చిన వారసత్వం, సత్వం నా రేపటి తరాల వాళ్ళకు నేనివ్వాల్సిన వేకువ జెండా ప్రతిదినం బతుకుపోరులో అలిసిపోని గుండెలెక్క బతికించే ప్రేమలప్రవాహాలై వాళ్ళు రేయింబవళ్ళు ఒకే శ్వాసగా ఈ నేలని ఆకుపచ్చటివనం చేసి బతుకును సద్దిగట్టి ఆకళ్ళు తీర్చిన వాళ్ళు అంతులేని చిన్ననీటివూటలై, వాగులై నదులై సముద్రాలై నిరంతరం కాపలాకాచే అలలసెంట్రీలై వాళ్ళు నింగీ నేల ఆల్చిప్పల నడుమ ముత్యాలలెక్క మనల్ని తమ స్వేదబిందువులతో జీవంపోసిన వాళ్ళు వాళ్ళ నుండే కదా ఈ దేహం, వాళ్ళదే కదా ఈ దేహం వాళ్ళిచ్చిన రక్తమాంసాలు,ఆలోచనలు అమానత్ గా తరాల కందియ్యాలె కద, నేను నా మీద నుండే అవతలి ఒడ్డుకు నడువాలె లోకమంతా ఒక్కయిల్లయితే బాగుంటది లోకానికంతా ఒక్కటే దుకాణమైతే ఏం బాగుంటది లోకాన్నే అంగడిజేస్తున్నోండ్లను వూర్లనుండి తరుమాలె మనది మనం పంచుకో నేరిస్తే బయటోనికి సందుండదు దుర్మార్గమైన ప్రపంచీకరణకు మందు స్థానికీరణే సకల అస్తిత్వాలను నిలబెట్టుకుంటనె సామూహికం కావాలె సకల జీవనసంస్క్రుతులను బతికించే ఏకత్వం కావాలె వాళ్ళు మనకు బతకడం నేర్పించిండ్రు, లడాయి చేసి చావడం చూపించిండ్రు వాళ్ళు మనుషులకొరకు ఎట్లా కొట్లాడాలో చెప్పిండ్రు, పానంజేసి ప్రేమించుడు తెలుసు పానమిచ్చిబతికించుడు తెలుసు వాళ్ళెత్తిన జెండా దించేదిలేదు వాళ్ళు చూపిన గమ్యం మరిచేది లేదు పొలాలు దోచి, హలాలు దోచి, ఇలాతలంలోని హేమం దోచి మాళ్ళు కట్లి, మాయామహళ్ళు కట్టి, ఆ దేశం నుంచి ఈ దేశం దాక మనుషుల రెక్కలు దోచి, రెక్కల కష్టం దోచి, మాటలు దోచి, బాటలు దోచి ఇండ్లు దోచి, పనులు దోచి, బతికేతత్వాన్ని దోచి, మనిషి లావు దోచి ఒక్కడుగ కనపడే పెక్కురూపాల దెయ్యాల్ని కాల్చే కాలం మనదే ఒక్కడుగు కూడ వెనకకు పొయ్యేది లేదు అక్కరకొచ్చే పానం వుంటే లోకమంతా, పొయినా లోకానికంత రేపు నా తర్వాత నావోళ్ళుంటరుకద
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sQRXmx
Posted by Katta
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sQRXmx
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి