తెరువెరుగని బాటసారి *******************************రావెల పురుషోత్తమ రావు. నిదురించే తోటలోంచి పాట యే మైనా వినిపిస్తుందేమోనని చెవులన్నీ చెట్ల ఆకులకు అతికించి శ్రద్ధగా ఆలకించి విన్నాను. పదినెలలు గడుస్తున్నాయేగాని పదిలమైన పాట మాత్రం నా చెవుల చెంతకు చేరిన దాఖలాల్లేవు. ఆశల తరువుమాత్రం చివుళ్ళు తొడగడం మొదలయింది. ఒక్క పాటా అటు వైపునుంచి పొటమరించిన దాఖలాల్లేవు. ఏక్కడకు పయనమై వెళ్ళావో ఎలా తెలుస్తుంది? గమ్యం తెలిస్తీ గదా గమన మార్గం వెదికే వీలయేది. దారులెన్ని ఎదురుగా స్పష్టంగా గోచరమవుతున్నా గానీ సరయిన త్రోవను మాత్రం ససేమిరా పట్టుకోలేక పోతున్నాను. ఆఖరు క్షణాల్లో నీవు చూసిన జాలిచూపులకు యేమైన కర్తవ్య బోధచేసావేమోనని కన్నీటిచుక్కలనన్నింటినీ విడిడిగా విడదీసి మరీ గాలించాను. ప్చ్!!! ఏమాత్రం అనుపానాలను అందుకోలేక పోయాను. పుట్టిన ప్రతిప్రాణీ గిట్టకతప్పదని తెలిసినా గిట్టిన నీ వు ఏ దిశగా పయనం సాగించావో నని పరిశోధించినా ప్రయోజనం చేకూర్చలేకపోయింది. అగ్ని సంస్కారం చేసిన కాపరిని అడిగాను విసుక్కున్నాడే గాని వివరమేమీ చెప్పనిచ్చగింపలేదు. అస్తికలను నిమజ్జనం చేసుకున్న పవిత్ర నదులనూ బ్రతిమాలాను మౌనమే తమ భాష్గా మూగనోమూ పట్టాయి అంతే. ఆమని నడిగాను ఆమె వెళ్ళిన జాడతెలుసునా అని? విరబూసిన సుమాలన్నీ మందస్మిత మయాయే గాని నోరు మెదపిన పాపాన పోలేదు. గతించిన శిశిరమూ, శరత్తూ, హేమంతం ఏ ఆచూకీ నివ్వలేకపోయాయి. గ్రీషం కూడా నాఘోషను ఆలకించిన పాపాన పోలేదు. సూర్యాస్తమయందాకా శూన్యదృక్కులను సారిస్తూ వివిషణ్ణ వదనంతో తెరువెరుగని బాటసారిలా నా ఒంటరితనాని మళ్ళీ భుజ స్కందాలకెత్తుకుని ఇంటిముఖం పట్టాను, విసిగి వేసారి విసిగించిన కాలాన్నీ తనివితీరా తిట్టుకుంటూ .14-5-14 ======================================
by Ravela Purushothama Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jsLGG4
Posted by Katta
by Ravela Purushothama Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jsLGG4
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి