రసశిల్పి అన్నమయ్య –|| ఆచార్య ఎస్ గంగప్ప -||అన్నమయ్య 605 వ జయంతి || by gdurgaprasad శ్రుతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞానసారంబులై/ యతిలోకాగమ వీధులై, వివిధ మంత్రార్థంబులై, నీతులై,/ కృతులై, వేంకట శైల వల్లభ రతిక్రీడా రహస్యంబులై,/ నుతులై తాళుల పాకయన్నయ వచోనూత్న క్రియల్ చెన్నగున్' - ఈ విధంగా ప్రసిద్ధి పొందిన తాళ్ళపాక అన్నమాచార్యులు (1408-1503) జననంతో తెలుగులో పదకవితావిర్భావ వికాసాలు ప్రారంభమయ్యాయి. అంతకు ముందు జానపదుల నోళ్లలో నానుతున్న పద కవితకు ప్రాధాన్యం లభించింది. అన్నమాచార్యుల రచనలను సంకీర్తనలంటారు అవి పదాలని గూడా ప్రసిద్ధమే. అందుకే అన్నమాచార్యులకు పదకవితా పితామహుడనీ, సంకీర్తనాచార్యుడనే బిరుదులున్నాయి. ఆనాటికే ప్రబంధకవుల వల్ల పద్యం ప్రసిద్ధమైంది. పద్యానికి పట్టాభిషేకం జరుగుతూంది. అది పండితులకు మాత్రమే పరిమితం. పదం ప్రజలందరికీ అర్థమయ్యేది. కనుకనే అన్నమాచార్యులు శ్రీ వేంకటేశ్వరునిపై శృంగార, అధ్యాత్మ సంకీర్తనలు 32 వేలు రచించి భక్తి, నీతి, వైరాగ్యాలను ప్రబోధించారు. ఆ పదాలలో పద్యకవులకు ఏ మాత్రం తీసిపోని కవితా వైభవాన్ని అన్నమాచార్యులు ప్రదర్శించారు. అన్నమాచార్యులు 32వేల సంకీర్తనలు రచించగా, మనకు లభించినవి సుమారు 14వేల పదాలు మాత్రమే. ఈ సంకీర్తనలు లేదా పదాలు శృంగార, అధ్యాత్మ సంకీర్తనలని రెండు విధాలు. శృంగార సంకీర్తనలన్నీ పైన పేర్కొన్న 'వేంకట శైల వల్లభ రతి క్రీడా రహస్యంబులు' అంటే, అలివేలు మంగా శ్రీ వెంకటేశ్వరుల అలౌకిక శృంగారాన్ని చిత్రించు పదాలని అర్థం. ఈ శృంగార పదాలలోను, అధ్యాత్మక పదాలలోను శృంగారంతో పాటు, భక్తి, నీతి, వైరాగ్యాల వర్ణన మనోహరం. అందులో వ్యంజితమయ్యే కవిత్వం మనోహరమై, సహృదయరంజకమై ఏ పద్యకవికీ తీసిపోని రీతిలో ఒప్పారుతూండడం విశేషం. ప్రతిభాపూర్వకమైన భావుకత, చమత్కార వైభవం, వ్యంగ్య స్ఫూర్తి, వర్ణనా వైదగ్థ్యం, ఆలంకారిక శైలీ విన్యాసం-మొదలైన విశిష్ట కవితా లక్షణాలతో అన్నమాచార్యుల కవిత్వం మనోజ్ఞమై ఒప్పుతూంటుంది. లాక్షణికులు విశ్వనాథుడు చెప్పినట్టు 'వాక్యం రసాత్మకం కావ్య'మ్మనే నిర్వచనానికి, జగన్నాథపండితరాయల 'రమణీయార్థ ప్రతిపాదక శబ్దఃకావ్య'మ్మనే సిద్ధాంతానికీ సమంగా సరిపోయే పదాలివి. అందుకే అన్నమాచార్యులు ఆంధ్ర పదకవులందరికీ గురువనడం సమంజసం. కవికి ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసముండాలంటారు. అందులో ప్రతిభ అనేది శ్రేష్ఠమైన గుణం. అన్నమాచార్యులలో ఈ ప్రతిభకు కొదవలేదు. భావుకత, ఊహాశాలిత అనే అంశాలు ప్రతిభా గుణ విశిష్టాలు. ఈ లక్షణాలన్నీ అన్నమాచార్యుల ఈ పదంలో మనం గమనించగలము. 'ఏమొకో చివురుటధరమున యొడనెడఁ గస్తురి నిండెను/ భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదుకదా కలికి చకోరాక్షికిఁ గడ కన్నులు గెంపై తోచిన/ చెలువంబిప్పుడిదేమో చింతిపరె చెలులు/ నలువునఁబ్రాణేశ్వరుపై నాఁటిన యాకొన చూపులు/ నిలువునఁ బెరుకఁగ నంటిన నెత్తురు కాదుగదా ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల/ వొద్దికలాగు లివేమో వూహింపరె చెలులు/ గద్దరి తిరు వేంకటపతి కామిని వదనాంబుజమున/ అద్దిన సురతపుఁ జెమటల అందము కాదు గదా' ఇందులో భావుకతననుసరించి భావమూ, భావాన్ని అనుసరించిన భాష ఒకటిని మించి మరొకటి పోటీపడుతున్నట్లు తెలుస్తుంది. అది అన్నమాచార్యుల ప్రతిభా సంపదకు చక్కటి నిదర్శనం. నాయక యొక్క 'చిగరు టధరమున' లేత పెదవిపై కస్తూరి నిండినట్లుందట. అంటే నల్లగా ఉంది. అది ఎలా ఉంది? 'భామిని' అంటే నాయిక 'విభునకు' ప్రియుడైన నాయకునకు వ్రాసిన 'పత్రిక' లేఖ ఏమో అన్నట్లుందట! ఇదెంత మనోజ్ఞమైన భావన! ఇలాంటి భావన చేసిన కవులు లేరు తెలుగులో. అది అన్నమాచార్యుల ప్రతిభ! ఇది కేవలం పల్లవి మాత్రమే. ఈ మూడు చరణాల్లోను ఈ చమత్కారం విదితమై కవి ప్రతిభా ప్రకటనకుపకరిస్తుంది. కవితలో చమత్కారముంటే కవి విశిష్టత తెలుస్తుంది. అన్నమాచార్యులు ఆయా పదజాలాన్ని ప్రయోగించి చెబుతూ వాటికున్న అర్థం ఎంత సార్థకమో వివరించాడు ఈ క్రింది పదంలో . అంతేగాక ఇందులో మరో చమత్కారం దశావతారాలకొన్నిటిని వర్ణించడం జరిగింది. 'ఈకెకు నీకుదగు నీడు జోడులు/ వాకుచ్చి మిమ్మఁ డొగడ వసమయొరులకు జట్టిగొన్న నీ దేవులు చంద్రముఖి గనుక/ అట్టె నిన్ను రామచంద్రుఁడన దగును/ చుట్టమై కృష్ణ వర్ణపు చూపుల యాపె గనుక/ చుట్టుకొని నిన్ను కృష్ణుడ వనదగును చందమైన వామలోచన యాపె Äౌఁగనుక/ అందరు నిన్ను వామనుడన దగును/ చెంది యాకె యప్పటికిని సింహ మధ్య గనక/ అంది నిన్ను నరసింహుడని పిల్వదగును' నాయికకున్న విశిష్ట లక్షాణాలని బట్టి నాయకుడైన వానిని శ్రీకృష్ణుని, శ్రీరామచంద్రునిగా చెప్పడం జరిగింది చమత్కారంగా. అద్భుతమైన వర్ణనా వైధగ్థ్యం, ఆలంకారిక శైలీ విన్యాసంకు శబ్దాలంకారం, అర్థాలంకారాలకు అన్నమయ్య పదాలు ఆటపట్టులు. ఈ సంకీర్తనలో చక్కటి శైలీ విన్యాసంను చూడండి: 'నెరజాణవు కడు నేర్పరివి మరిగె నీకు నిన్ను మన్నించవయ్యా దొంతులు వెట్టీ దొయ్య వలపులు పంతపు మాటల బలుమారును చింతల చిగురుల సిగ్గులనయ్యా చెంత జేరి మచ్చికగొనవయ్యా' ఇలాగా అన్నమ ఆచార్యులు సంకీర్తన రచన చేసినా ప్రబంధ కవులకు మాత్రం తీసిపోనిరీతిలో కవిత్వంలో తన సహజమైన ప్రతిభాపాటవాన్ని ప్రకటించి తదనంతర వాగ్గేయకారులకు ఆదర్శమయ్యారు. n ఎస్. గంగప్ప విశ్రాంతాచార్యులు http://ift.tt/1llCQf1
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1llCQf1
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1llCQf1
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి