పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, మే 2014, శనివారం

Nirmalarani Thota కవిత

చిన్నప్పుడు ఏం పండివంటలు చేసినా నాన్న రానీ.. అని అమ్మ అంటుంటే అర్ధం కాక అల్లరిచేసే పసితనం.. కాస్త పెరిగాక క్లాసు ఫస్టు రాలేదని కోప్పడుతుంటాడని ప్రోగ్రెస్ కార్డు దాచేసి తప్పించుకు తిరిగే అలవాటైన భయం కాలేజీలో చేరాక అంతులేని ఆంక్షలు పెడుతుంటే ఐదు నిమిషాలు ఆలస్యంగా ఇల్లు చేరితే అంతెంత్తున నన్నూ అమ్మను కలిపి తిడుతుంటే హిట్లరును చూసినట్టు లోలోపలి అసహనం.. ఎప్పుడూ నువ్వు నాకు అర్ధం కాలేదు.. విసుర్లు, కసుర్లు తప్ప నాకేమీ కనిపించలేదు.. కరుడు గట్టిన గాంభీర్యం రాతి విగ్రహంలాగానే తోచేది నిన్ను పూజించే అమ్మను చూస్తే జాలి వేసేది.. ఎందుకింత మౌనం నీకు? ఎందుకంత దూరం మాకు..? నీ ప్రావిడెంటు ఫండంతా మా పెళ్ళిళ్ళకు ధారబోసి పెన్షన్ డబ్బుల్లోంచి లాంఛనాలన్ని తీర్చేసి అడపాదడపా చేసిన అప్పులన్నీ కడుపుగట్టుకొని తీర్చేసి గుండె కలుక్కుమన్నప్పుడు గుట్టుగా దాచుకున్నావే.. అప్పుడైనా చెప్పాల్సింది నాన్నా..! నోరు విప్పాల్సింది నాన్నా . . ఒక్క సారి ఏడ్వాల్సింది నాన్నా..! ఒక్క సారి నిన్ను తాకాలని ఉంది నాన్నా..! కన్నతండ్రిని కూడా హత్తుకోలేని నా వయసునూ, ఆడతనాన్ని మరచి ఒక్క సారి.. ఒక్క సారి నీ చేతుల్లో ఒదిగిపోయి కడుపారా ఏడ్వాలని ఉంది నాన్నా..! నీ గుండెల్లో ఘనీభవించిన యుగాల దుఖ్ఖాన్ని కన్నీరుగా కరిగించాలని ఉంది నాన్నా..! నీ ప్రతి ఆఙ్ఞ నా భవిష్యత్ సోపానానికి సం ఙ్ఞ అని నీ ప్రతి ఆంక్ష నన్ను పదిలంగా పొదువుకోవాలనే ఆకాంక్ష అని తెలుసుకోలేక జీవితాన్ని తీర్చిదిద్దిన నీ తీర్చుకోలెని ఋణానికి ... నిన్ను గుర్తించలేని అవివేకానికి ప్రతిగా నీ పాదాలపై ప్రణమిల్లి కన్నీటి జల్లుతో ప్రక్షాళన చేయాలనుంది.. నన్ను క్షమించు నాన్నా..! అమ్మంటే ఆది దేవతని అహరహమూ ఆరాధించే మేము అమ్మకు ఆరాధ్య దైవమైన నీ అంతరంగపు విశ్వరూపాన్ని చూడలేని అవిటితనాన్ని మన్నించి మాతో మనసు విప్పి మాట్లాడు నాన్నా..! మా గుండెల్లోనే మీకు చోటు.. దరికి రానీయము ఇక ఏ గుండె పోటు. . ! ! నిర్మలారాణి తోట తేది: 31.05.2014

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gPMRFd

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి