అబ్బూరి రామకృష్ణారావు....(నేడు వారి జన్మ దినం) --------------------------------------- జీవించిన ప్రతి క్షణం పూర్ణమక్షరం నిత్యం' Published: Wednesday, October 4, 2006, 23:53 [IST] : అబ్బూరి రామకృష్ణారావు. నూటనాలుగు సంవత్సరాల క్రితం జన్మించిన ఒకానొక కవి గురించి ఈ రోజున మనం చర్చించుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందసలు ? తొంభై ఒక్క సంవత్సరాల క్రితమే ఆయన తొలి తెలుగు కాల్పనిక కావ్యం కల్పించి ఉండొచ్చుగాక! కానీ ఇప్పుడు ఆయన గురించి పనిగట్టుకుని ప్రస్తావించాల్సిన అగత్యం ఏమిటి? "ఎంత వ్రాయగల శక్తి ఉందో అంత తక్కువ వ్రాసి" ఆయన విపరీతమనిపించే ప్రమాణంలో విచక్షణ ప్రదర్శించిన మాట నిజమేనని మాట వరసకు ఒప్పుకుంటున్నాం.ఎంత అరుదైన, అసాధారణమైన వ్యక్తి అయినా ఆయన గురించి ముచ్చటించడానికి సైతం ఒక సందర్భం అంటూ ఉండాలి కదా- అదేమిటి? యాభైఏళ్ళపాటు సాహిత్యసేవ సాగించిన సదరు మహానుభావుడు స్వచ్ఛందంగానే రాయడం విరమించి ఉండొచ్చు. తద్వారా చుట్టూ ఉన్న బండ,మొండి ప(రి)సరాలమీద తన అంచనా ఏమిటో విలక్షణమైన రీతిలో వ్యక్తం చేసి ఉండొచ్చు. కానీ మళ్లీ అదే ప్రశ్న ఈ ప్రశ్నకు ఒక్కటే సమాధానం! అబ్బూరి రామకృష్ణారావు గురించి ప్రస్తావించుకోడానికి ప్రత్యేకంగా ఒక సందర్భం ఎంత మాత్రం అవసరం లేదు. ఆయన కేవలం రేర్‌బర్డ్ మాత్రమే కాదు- రేర్ బార్డ్ కూడా. పైపెచ్చు అబ్బూరి గురించి ముచ్చటించుకోవడమంటే సార్ధకమయిన, సంపూర్ణమయిన జీవితం గురించి మట్టాడుకోవడం. తెలుగు జాతి సాహిత్య చరిత్రగా నిలుస్తోంది ఆయన జీవిత చరిత్ర. అలాంటి అబ్బూరి గురించి ప్రస్తావించుకోవడానికి పంచాంగాలు తిరగెయ్యాలా ? పదమూడో యేటనే (1909లో) అబ్బూరి రామకృష్ణారావు రాసిన 'జలాంజలి' పద్య కావ్యాన్ని పరిశీలకులు తొలి తెలుగు కాల్పనిక కావ్యంగా పరిగణిస్తున్నారు. తెలుగు జాతి దౌర్భాగ్యమేమిటంటే, సదరు జలాంజలి కావ్యం సంపూర్ణమయిన రూపంలో ఎవరి దగ్గరా లేదు. కవిగారు సరే- అసాధారణమయిన, విపరీతమైన వ్యక్తిత్వ శోభ అయినది. అలాంటి వ్యక్తి దగ్గిర ఆయన రచనల తాలూకు కట్టింగులూ, క్లిప్పింగులూ కాపీలు దొరుకుతాయని ఆశించడం బాల్యం. కాగా తెలుగునేల నాలుగు చెరగులా విస్తరించి ఉన్న అబ్బూరి ఆప్తులు, ఆత్మీయులు, అంతేవాసులు కూడా ఆయన రచనల్లో చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉన్న ఈ కావ్యాన్ని సంపూర్ణరూపంలో పునర్నిర్మాణం చెయ్యలేకపోవడం దారుణం. కానీ జరిగిపోయింది మరి! అబ్బూరి మేష్టారికి ప్రేరణగా నిలిచిన సమకాలీనుల్లో ముఖ్యుడైన కట్టమంచి రామలింగారెడ్డిగారు పింగళి సూరన ''కళాపూర్ణోద''యాన్ని పద్యరూపంలో వున్న నవలగా అభివర్ణించారు. ఆ లెక్కన చూస్తే అబ్బూరి రచన ''మల్లికాంబ'' కూడా పద్యాల్లో రాసిన నవలికగానే లెక్కకొస్తుంది. ''పూర్వప్రేమ'', ''నదీసుందరి'' కూడా అంతే. అబ్బూరి రాసిన తొలి ఆధునిక కవిత్వ ఖండికలు ''ఊహాగానము''లోనే కనిపిస్తాయి. ''అప్రాప్తమనోహరికి'', ''కాపుపాట'', '' మృతప్రేమ''లాంటివి ఉదాహరణ ప్రాయమయిన భావకవితా ఖండికలు. ఈ ధోరణిలో ఆయన సుమారు మూడు దశాబ్దాలు కవిత్వం చెప్పగలగడం చూస్తే అబ్బూరి రామకృష్ణారావుగారెంత ఓపికమంతులో అర్ధమవుతుంది. అయితే అదే రోజుల్లో ఆయన కుడీఎడమ చేతులతో శ్రీశ్రీ, పురిపండా, నారాయణబాబు, వరదలాంటి అభ్యుదయ కవులకు తర్ఫీదిస్తూ పోవడం గమనార్హం. అరుదయిన సృజనాత్మకతకు పరిపక్వ మేథస్సు తోడయితే ఎటువంటి అద్భుతం సాధ్యమవుతుందో ''కవిత''లో వచ్చిన అబ్బూరి ఖండికలు రుజువు చేశాయి. ''పైరుపండి రాలినట్లు ముసలియై లయించుజీవి రాలిమరల వచ్చుననుట రమ్యమయిన ఎండమావి''లాంటి స్టేట్‌మెంట్‌లు కేవలం కవిప్రాయుడుగాని, కేవలం తాత్వికుడు గాని అయిన వ్యక్తి చెయ్యలేనివి. ఆ రెండు లక్షణాలు సంతరించుకున్న అబ్బూరిలాంటి వాళ్లకే అలాంటి స్టేట్‌మెంట్ చేయగల శక్తి సొంతమవుతుంది. ''మరణం మరణించిందను మాయమాట రానీయకు, నీ హతకుడ నేనేనను నిందను నాపై వేయకు'' అనగల ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం అబ్బూరి సొంతఆస్తి. అలాంటివాళ్ల గురించి మాత్రమే అనగలిగిన మాట కూడా ఆయనే అనేశాడుః ''జీవించిన ప్రతిక్షణం పూర్ణమక్షరం నిత్యం''. అందుకే అబ్బూరి మృతి గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు. కాలం నర్తకి ఏనాడో రావలసిం దీవారణపురికి మనం ఆ విశాలవట వృక్షం నిశ్చలనిభృతాగారం ఇంకా నిలిచే ఉన్నది. నాడు మనకు చిన్నతనం అల్లదుగో ! స్వర్ణశిఖర దేవమందిర ద్వారం నిన్నూ నన్నూ ఎరుగరు నేటి కొత్త పూజారులు పరిచిత కంఠస్వరాలు చెవులకు పండుగ చేయవు అటూ ఇటూ నిర్మించిన కొత్త కొత్త రహదారులు ఆ వెనకటి సుధాస్మృతులు వేరొక రుతి విననీయవు అసంబద్ధయశోవాంఛ పరచింతాపరాఙ్ముఖత ప్రబలే ఈ నగరంలో ఏమున్నది తుదకు ఫలం ? అంతులేని ధనపిపాస అనాగరక నాగరకత ఈ రొదలో ఎలా మనం మనుగడ సాగించగలం ? గతం గడిచిపోయిందని ఏలా ఈ అనుతాపం? కాలం నర్తకి, బహుశా మారుస్తున్నది రూపం! Read more at: http://ift.tt/1wD0qN5
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wD0qN5
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wD0qN5
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి