ఒంటరి బ్రతుకులు/విశ్వనాథ్ పైత్యం ప్రకోపించినట్లుగా మధం మత్తెక్కిన రెండు మృగాల అనుసంధాన ప్రక్రియలో ఉద్భవించిన శిశువులు వారు.. మురిపాలు,ముర్రుపాలంటు ఎరుగరు. మిగతా వారిలా మమకారాల రుచి కూడా తెలియదు. పుడుతూనే కుప్పతొట్లకి దత్తతెళ్ళిన కుంతీపుత్రులు. అమ్మలాగే ఆదరించిందది, తనకొచ్చిన రెండు ఎంగిలాకులాలలో సగం కుక్కలకు, సగం వారికి పంచుతూ, మాతృత్వం, మానవత్వం నశించిన మనుషుల కంటె మిన్నగా ప్రేమ పంచుతూ. అప్పుడప్పుడూ మంచినీటి నల్లాలే నాన్నలవుతుంటాయి.. తిండి దొరకని నాడు నేనున్నానంటూ నాలుక తడిపి ఆసరగా నిలుస్తూ. గాలికి ఎగిరిపడ్డ విస్తరాకుల్లా రోడ్డున పడ్డ జీవితాలు. అనురాగం పిల్లగాలిలా కొంచెం తగిలినా పరవశించిపోతూ, బంధాలను తెంపి చుట్టచుట్టుకుపోయిన విధి సుడిగాలిపై ఆక్రోషం వెళ్ళగక్కుతూ... తడబడుతూనే సాగే పయనం తడుస్తూనే ఉన్నా చిరకాలం నయనం. వారి జీవితాన్ని తులాభారం వేస్తే కన్నీళ్ళు ఓ కడివెడు,ఆనందభాష్పాలు ఓ చెంచాడు తూగుతాయి. షాపులు మూసిన షట్టర్ల బయట శయనం... ఎవడే కర్కశుడి రూపంలో వచ్చి తన్ని లేపుతాడో అనుకుంటూనే కలతనిద్ర. దొరికితే పిడికెడు ఎంగిలి మెతుకులు ఎంగిలిపడుతూ... దొరకనప్పుడు గుక్కెడునీళ్ళతో ఎంగిలి తడారినివ్వకుండా తడుపుకుంటూ... ప్రతిరోజు ఇదే దినచర్య... తావులేదు ఇంకో ప్రతిచర్య. ఒక్కటంటే ఒక్కటే బట్ట... కట్టింది విడువరు విడిస్తే కట్టేందుకు ఇంకోటిలేదు. నూలుపోగెరుగని చర్మమే దేహాన్ని అంటిపెట్టుకుండే కవచం. చూసేవారికి వివస్త్రం లేనివాడికదే చిరగని వస్త్రం. దాపరికం దరిదాపుల్లో లేని వీది బ్రతుకులు దాచుకోవడానికి వీలులేని రహస్యాల జీవితాలు. దారం తెగినా ఎగురుతూనే ఉంటుంది ఈ గాలిపటం గాలి ఉన్నంతవరకు.. నేల చేరేవరకు... ఏ ముళ్ళ కొమ్మకో చిక్కనంతవరకు.. జీవితం చిల్లులుపడి చిరిగిపోయే వరకు. కొనసాగుతూనే ఉంటుందీ పరంపర ఆగనంతవరకు మృగాల విచ్చలవిడి కామక్రీడ. బ్రతుకుతూనే ఉండాలి... అంతిమంగా మళ్ళీ అనాధగానే పోయేవరకు.. ఏ మురికి కాలువలోనో శవమై తేలేవరకు..!! 19MAR14
by Viswanath Goud
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g0XrqL
Posted by Katta
by Viswanath Goud
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g0XrqL
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి