మట్టి తల్లీ ! దండాలు !! ~~~~~~~~~~~~ నా శ్వాసకోశాల్లో ప్రవహిస్తున్న మట్టి పరిమళాలు మనోఫలకంపై ధారలు గా వర్షి స్తున్న స్మృతుల వెన్నెల జలపాతాలు .. ప్రతి ఉషోదయాన విచ్చుకుంటున్న వసంత వేకువ కిరణాలు .. ధ్వంసాలకూ ,నిర్మాణాలకూ నడుమ సాగే నిరంతర యుద్ధాలు ... నన్ను జడత్వ మత్తు ఆవరించినపుడల్లా కవిత్వాన్ని ఆహ్వానిస్తాను కవిత్వ సోపతి పట్టినపుడల్లా మట్టి నన్ను హత్తుకుంటది మనిషి ఎంత ఎత్తులకెదిగినా మట్టే కద పునాది ! శిశిరమై రాలిన పండుటాకుల్ని,ఎండుటాకుల్ని కడుపుల దాచుకుంటది వసంతమై కొత్త చిగుర్లని పొత్తిళ్లనించి మొలకెత్తిస్తది మనిషి చేసిన విషపు గాయాలకు ఛాతీ చీల్చుకుని మొరపెడ్తది ఎన్ని పొద్దుపొడుపుల్ని ,ఎన్ని నెత్తుటి వెన్నెలల్ని , ఎన్ని నిప్పులవర్షాల్ని ,మరెన్ని వరదల సునామీల్ని చూసిందో ! అనంత శతాబ్దాలుగా మోసి వంగిన వీపు పచ్చిపుండైనా నీ కోసం మట్టి తల్లి ఆరాటం ... కండ్లల్ల విషం చిమ్మినా ... నీకు వెన్నుదన్నై నిలుస్తున్నది ప్రేమించడమే జీవలక్షణంగ మురిసే పిచ్చి తల్లి తనువు నిత్యగాయాల కొలిమైనా .. తనయులకోసం ఆగని తండ్లాట! తన గుండె కాన్వాస్ పై ప్రతి ఉగాదికీ అద్దుకుంటున్న కాలపురుషుని ముద్రికలు తల్లిగుండెను యంత్రాల గునపాలతో చిద్రాలు చేస్తున్నా .... రస స్తన్యాన్నిస్తూ ,తరాల మనిషి చరితకు దారి వేస్తున్న .. ఆకుపచ్చ నిచ్చెన..! అలిసిన నీ దేహాన్ని వసంతగాలుల విసనకర్రలతో వీస్తూ ఆఖరి మజిలీ దాకా తోడై నడుస్తున్నది .. మట్టికీ పాదాలకూ నడుమ ఏ అయస్కాంతముందో మట్టికి మనిషికీ మధ్య ఏ అమృతరసబంధముందో వెన్నెముక నాడుల తీగ ల్లో ఏ నిశ్శ బ్ద మార్మిక గీతముందో ప్రతి రాత్రి నీకొక కొత్త చైతన్యదేహాన్నిస్తూ ఆకాశపు గొడుగు నీడన ఆకుల తివాచీ మీద నిన్ను నడిపిస్తది నదుల్లో నీరింకినపుడల్లా .. కనురెప్పలల్ల దాచుకున్న మమకారపు సముద్రాల్ని ఒంటి మీద పారిచ్చుకుంటది నీ కొత్తింటి పెద్దర్వాజాకు మామిడాకు తోరణమై తరాల మనిషి చరితకు ఆలంబనై అల్లుకుంటది పుట్టుకనుంచి దగ్ధమయ్యే దాకా దారిదీపమై , విరబూసిన మందారాల్నీ ,అరవిచ్చిన అరవిందాల్ని మనిషి శిరసున సిగపువ్వై ,నెమలీకై మురిసిపోయే వెర్రితల్లి నిత్యం నా గుండెపొలంలో మమకారపు పంట పండిస్తూ ... నన్నొక హరిత బంధంతో నడిపించే జీవద్రస ప్రవాహమా ! మట్టి మా తల్లీ ! నీకు ఒళ్ళంతా చేతుల్ని చేసి దండం పెడతా !! @డా. కలువకుంట రామకృష్ణ .
by Ramakrishna Kalvakunta
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1moVBR6
Posted by Katta
by Ramakrishna Kalvakunta
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1moVBR6
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి