కపిల రాంకుమార్||ఆశాకిరణం కోసం!|| కుప్పిగంతుల సర్కస్ రాజకీయ కారడవిలో గూళ్ళు మార్చిన పిట్టలు ఆ గూటి గులాంగిరి చేస్తుంటాయి! అపస్వరాలలవాటుగదా! అవేపాత రోత వదలలేక తిట్లపురాణాల్లో నిష్ణాతులు కనుక నోటి దురుసు, దురద వదలలేక పాత రోకటిపాటే పాడుతూ నిన్న తిట్టిన వారి పంచ నేడు చేరి నేడు పొగిడే నరంలేని గాయక నాయకులవుతుంటారు! పద బంధాలకు నిఘంటువులతో పనిలేదు వెతికినా దొరకని భాషాశాస్త్రజ్ఞులు! కొత్త స్వరంలో స్వంత రాగాలాలపిస్తూ మీడియా ప్రలోభాలొదుకోలేక బఫూన్ పాత్రధారులతో పోటీ పడుతుంటారు! ప్రణాళికలు లేవు, విధివిధానాలు లేవు! సిద్ధాంతాలు బలాదూరు చేసి బజారుకీడ్చి, సింహాసనావరోహణే ధ్యేయం! దుమ్మెత్తి పోయడానికే ప్రాధాన్యతిస్తారు! పాత సినిమాలో పాటలా " చవటయను నేను! నీ కంటే ఒట్టీ చవటాయను నేను " అని చెవులకు చిల్లులు పెడుతుంటారు! రంగులుమార్చే ఊసరివెల్లులమించి ఎంత గుంజుకోవచ్చు! ఎంత మిగుల్చుకోవచ్చు ననే రంధి తప్ప ఊరివారి బాగోగుల వూసుండకుండా జాగ్రతపడతారు! ఓట్లను రాబట్టుకోటంలో వెర్రివేషాలెన్నైనా వేస్తుంటారు ఇచ్చిన మాట నిలబెట్టరు కాని, చిచ్చులు పెట్టటంలో సిద్ధహస్తవాసులు! కడుపులోంచి మాటలు రావు, వచ్చినా అవి నోటి చివరివే అదీ నోటు చివరివే! చెల్లని నోట్లను యిచ్చి నల్లధనాన్ని తెల్లబరచుకునే యెత్తులువేసి చల్లగా జారుకుందామనుకూంటారు! వట్టి కారు కూతగాళ్ళ ఎత్తులు చిత్తు చేసి చేవకలిగిన నేతల్ని ఎన్నుకోవాలని సామాన్యులు ఈ ఎన్నికల కూడలిలో తోడుకోసం ఎదురుచూస్తున్నారు! వారిని పట్టించుకునే వారికోసం, యిన్నాళ్ళు పడ్డ దగా కుహురంనుండి విముక్తి కలిగే నిత్య జీవన సమరంలో పాలుపంచుకునేవారికోసం,లంచగొండులను, రాజకీయ విటులను '' నోటా ''తో నైనా పోటు పొడవాలని కాదు కాదు ధీటైన నేతను ఎన్నుకోవాలని ఎదురుచూస్తున్నారు! సహస్ర వృత్తుల బడుగుజీవుల సమరశీల పోరు పటిమ జయకేతనమేగిరేలా సమ సమాజ శక్తులపునరేకీకరణ కోసం సర్వ సత్తాక సామాజిక పాలకులకోసం రేపటి ప్రజాస్వామ్య నూతన అరుణకాంతికోసం ఎదురుచూస్తున్నారు! 31.3.2014 ఉదయం 5.30
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jNbh3e
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jNbh3e
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి