పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, సెప్టెంబర్ 2012, బుధవారం

వంశీ // మోడస్ ఒపెరాండి //

నాకు ఏ బాదా, నొప్పి ఉండదెందుకో
తెల్లటి పావురాల తలలు తెంచి రక్తం పారిస్తుంటే,
నాకు ఏ దుఃఖం, వేదనా అనిపించవేమిటో
ఓ మనిషో మనసో నలిగినా విరిగినా
ఓ తరువో గిరులో కాలినా కూలినా,
నాకేం కానంతవరకు,
నాదేమీ పోనంతవరకూ,

నాకే కోపమూ అసహ్యమూ రాదేమిటో
వ్యభిచారులూ అరాజకీయులన్నా
తాగుబోతులూ మోసగాళ్ళూ ఐనా,
ఎంతకష్టమో నిజంగా
సమాజం ఒప్పని పనులు చేస్తూ
జనాలు మెచ్చని కలల్ని చూస్తూ

విలువలూ ఆచారాలూ
ఒడ్డునుండి కడుపునిండినోడికే,
తెప్ప దొరకక కొట్టుకుపోయేవాడి
ఆకలి ఆశలు ఆరాటం పోరాటం
వాడిదైన ప్రపంచాన్ని బ్రతికించుకుని
వాడివవని ప్రమాణాలతోనిత్యం ప్రయాణించడానికేగా..

నాకే ఆవేశమూ ఆలోచనా కలగవెందుకో
కవులు జీవితాన్ని రాయక ఊహల్లో తేలితే,
రాసినట్టు జీవించక వైరాగ్యంలో మునిగితే,
అవునూ, కవీ నాలాంటి మనిషేగా

నాకే అపరాధభావనా, ప్రాయశ్చిత్తపు
పరిహారాలమీదా నమ్మకం రాదెందుకో
రజస్వలించిన చీకట్లో ఇంద్రియాల్ని సంతృప్తీకరించి,
కామరూపుడినై కలుషితాలోచనలతో స్థలకాలాలనోడించి
ఐదో పరిమాణపు నీడల చిరుగుల్లోంచి
ఆత్మనొదిలిన శరీరాల చెమటతో తడిసిన
అంగాలు స్పృశించి అమరుణ్ణవుతుంటే,

నాకే భయమూ బంధాల బడలికా ఉన్నట్టనిపించవు
రేపే మరణిస్తానన్నా,
లోకపు చూపే మారిపోతుందన్నా,

నేను నిర్దేశించుకున్న, నాకు మాత్రమే తెలిసిన
గమ్యం చేరే వడిలో
నేను ఉద్దేశించుకున్న, ఎప్పటికైనా అధిరోహించే
శూన్యం కనిపించేవరకు
నేనిలాగే ఉంటాను
నన్నలాగే అనుకోమంటాను

9.11.12 ( తాలిబన్లు కూల్చిన W.T.C లో, చనిపోతామని తెలిసాక ఆ మనుషుల మానసిక స్థితి గుర్తొచ్చి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి