"సరిగ్గా ఏడాదిక్రితం..
ఒంటరితనం నామీద అమాంతం దూకినగుర్తు..!
అప్పుడు
నా డైరీ పేజీల మడతల్లో
అట్టకట్టిన నీ నవ్వులు
ఇప్పుడు
కళ్ళనే జీవనదుల్లో..
సుళ్ళుతిరిగే కన్నీళ్ళు
ఎన్ని ఆత్మహత్యలపరిచయాల్లో అద్రుశ్యమయ్యావ్..!
కొన్ని..
కవిత్వం నిండిన కాగితాలు
బస్సులో నాపక్కన ఖాళీసీటు
అవుటాఫ్-సర్వీస్ సెల్ల్ నంబరు
నా దేహపు పొరల్నిచీల్చుకున్నా
లోపలలోపల తొవ్వుకున్నా
అవే అవే జ్ఞాపకాలు.
ఎన్ని నవ్వుల్ని కన్నీళ్ళుగా అనువదించావ్..!!
గుర్తు..
కారిడార్లో ఆరేసిన నీ తెల్లటి చుడీదార్,
"నే తొలిసారిగా కలగన్నది నన్నేకదా"
అబద్దాలకోరు డయలర్ టొన్
నన్నుకవిని చేసిన నీ మాటలు,
నేను బతికుండే తడిక్షణాలు.
ఎన్నింటిని దూరంచేస్తూ "దూరం"గా మిగిలావ్!
సమస్తం అనుకున్నవి ఇక అస్తమించాయి!
"జీవితపు ఖాళీగదిలో నాతోపాటు
కవిత్వం నిండిన కాగితాలు కొట్టుకుంటున్నాయి!"
........................."నీ"
("నిత్యగాయాల నది" జీవితంలో
ప్రతిగాయం నుంచి కాస్త కవిత్వాన్ని వొంపుకుంటూ...)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి