ఎన్నని చెప్పాలే ఏమని చెప్పాలే.ఒక గాయమైతే మరచిపోవచ్చు.కండ్లుతెరిచిన గడియనుండి రోజు నిష్క్ర్రమించేదాక గాయాల మీద గాయాలు.నిలువెల్లా గాయాలే దేహమౌతున్నవాణ్ణి.ఒకటా రెండా విరిగిన లాఠీలు ఎక్కిదిగిన ఠాణాల మెట్లు లెక్కేలెవ్వు.అయినా నాకు ఇబ్బందేంలేదు.గాయలదేముంది.ఓ వైపు ప్రాణాలకు ప్రాణాలే అవలీలగా ఉద్యమానికిచ్చిన నాతోటి విద్యార్థులు జనాలు.వీళ్ళ త్యాగాల ముందు నాకైన ఈ గాయాలేపాటివి.నేనేనా గాయపడింది.తెలంగాణకు తెలంగాణానే ఓ మానని గాయం.ఒడవని దుఃఖం.ఐతే గాయాలు మాకు కొత్తేం కాదు.సూర్యుడు రోజు ఉదయించడం వింతేం కాదు కనిపించకపోతే కదా వింత అమావాస్యా!నాకు ఐన ఈ గాయాలు ఎంత. నిజంగా గాయాల వల్ల నేను గాయపడలేదు.బిడ్డా ఒళ్ళంత నెత్తురుముద్ద చేసుకుంటివి ఎట్ల ఉండేటోనివి బిడ్డా!తెలంగాణ తెలంగాణ అంటివి అని అమ్మ ఏడ్చినప్పుడు నిజంగా గాయపడుతున్నా.గాయాలను త్యాగాలను కుప్పగా పోసి డబ్బులసంచుల్ని ప్రాజెక్టుల్ని మోసుకొచ్చిన సోకాల్డ్ రాజకీయ ఉద్యమకారులను చూసి మళ్ళీ మళ్ళీ గాయపడుతున్నా.నేనే కాదు 60ఏండ్లసంది త్యాగాలే వారసత్వంగా తీసుకుంటున్న నాలాంటివాళ్ళను చూసి తల్లీ తెలంగాణం నెత్తురు స్రవిస్తోంది కన్నీళ్ళకు బదులుగా.ఐతే గాయమెప్పుడు గాయంలా ఉండదు.గాయం పోరాటానికి సమాయత్తం చేసే ఓ సిగ్నల్.ఓ మెసేజ్.ఇప్పటిదాకా నేను ఓడిపోవచ్చు కాని నా గాయం ఎప్పుడూ నన్ను సిద్దం చేస్తుంటుంది విజయం కోసం పోరాడమని.గాయం ఇప్పుడు ఓ జ్ఞాపకం మాత్రమే కాదు...కొత్త బతుక్కు దారి చూపించే ఓ దిక్సూచి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి