నా హృదయంలోని కొన్ని భావాలు ఒలుకుతాయి
అక్షరాలు ఒకచోట చేరి పదాలవుతాయి
నా భావాలకు ఒక రూపాన్నిస్తాయి
నన్ను స్వచ్ఛంగా చూపే ప్రయత్నం
ముసుగు తొలగించి
గజిబిజి జీవిత పరుగులాపీ కొన్ని క్షణాలు మీతో పంచుకునే తాపత్రయం
కాగితంపై చేరిన అక్షరాల్లో లీలామాత్రంగా నైనా నేను అచ్చం నాలాగే ఉంటాననే ఆశ
అందుకే ఈ అక్షరాలను పోగేసి
నన్ను ప్రదర్శనకు పెట్టాను
యద లోలోపల ఏదో మూలకు భయం భయంగా నక్కిన నన్నులేపి మీముందు నిలిపాను
సమాజ పరిమితులు.. ఎవరో విధించిన కట్టుబాట్లు
పెరిగిన వాతావరణం నేర్పిన సంకుచిత భావజాలం
డౌట్ లేదు.. ఈ సమాజం తనకు అనువుగా మలుచుకున్న తోలుబొమ్మను నేను
కొన్ని పరిమితులకు లోబడి స్పందిస్తాను
అందరిలాగే నేనూ నటిస్తాను
అందరినీ అనుకరిస్తూ
కొందరిపై గౌరవం నటిస్తూ
ఇంకొందరి నుంచి తప్పుకుంటూ
ఎందరెందరికో దూరంగా ఉంటూ
ఏమీ పట్టనట్టు
తెలిసీతెలియనట్టు
ఉండీ లేనట్టు
నా మానాన నన్ను బతకమంటూ
నా నరనరాల్లో నూరిపోస్తోంది ఈ సమాజం
కులాల రొచ్చులోనో
మతాల ఉచ్చులోనో
బతుకు వెళ్లదీయమంటోంది
అడుగడుగునా హద్దులు
దాటిరావద్దనే సంకెళ్లు
కొన్ని బలవంతపు నవ్వులు
మరికొన్ని నాటకాలు..
అన్నింటినీ అధిగమించు
అక్షరాల్లో దూరినప్పుడు
నేను కనిపిస్తాను
లీలామాత్రంగా అయినా మనిషిలాగా
ఈ మహా జనారణ్యంలో ి మనసుతో పోల్చుకుంటే ఎప్పడోసారి ఎదురయ్యే అచ్చమైన స్వచ్ఛమైన మనిషిలాగా
www.naachittiprapancham.blogspot.in/2012/09/blog-post_10.html?m=1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి