ఎన్నాళ్ళీ నియమాల నిచ్చెనమెట్లు
ఇక ధ్వంసం చేద్దాం_
ఈ రంధ్రాన్వేషణలకు
ఈ శిల్పాన్వేషణలకు
ఇక ముగింపు పలుకుదాం_
జనాలకోసం రాస్తున్నప్పుడు
జనాలకు అర్ధంకాకపోతే
అదేం కవిత్వం?
పదాల్ని శిల్పాల్లా సానబెట్టీ
సర్ఫులో నానబెట్టీ
ఉతికి ఆరేసేదే కవిత్వమా?
అర్దంకాకుండా పోయెదే కవిత్వమైతే
అర్దమయ్యేదేంటీ?
విమర్షకుల ఇనుపకచ్చడాల
చట్రాల కిందపడి_
పరిశీలకుల పాముకాటుకు గురై
నురగలు కక్కుతూ
చచ్చీ చెడీ
బతికి బట్టకట్టేదే పదమా
అ పదాలసమూహమే కవిత్వమా?
కవిత్వానికి కులముంటుందా?
కవిత్వానికి మతముంటుందా?
ఎవరు ప్రయోగిస్తే పదం
ఎవరు సాగదీస్తే వాక్యం
ఇంకెవరు ఇరగదీస్తే కవిత్వం?
మంత్ర నగరిలో మృగాళ్ళకు బలైనా అబల స్థితిని
నడిబజారులో నెత్తురోడుతున్న అమరుని త్యాగాన్ని
ఏ శిల్పం ఎవరి సాంప్రదాయ చట్రంలో ఇమడ్చగలం
అందమే ముఖ్యమన్నోళ్ళకు
విషయం ముఖ్యం కాదేమో?
మేళాలు తాళాలే ముఖ్యమన్నోళ్ళకు
తండ్లాట ముఖ్యం కాదేమో?
జనాలు పట్టని
జనాలు లేని కవిత్వానికి
బలముండదు
విలువుండదు
చరిత్ర ఉండదు_
ఎన్నాళ్ళీ నియమాల నిచ్చెనమెట్లు
రండి! ఇక ధ్వంసం చేద్దాం_
12.09.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి