పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, సెప్టెంబర్ 2012, బుధవారం

జగద్ధాత్రి || మృత్యు భాష ||

యుగాలుగా నన్ను అనుభూతిస్తూనే ఉన్నారు
పంచేంద్రి యాలతోనూ
జ్ఞానేంద్రియం తో నూ
నన్ను మీ ప్రతి భావనలోనూ
రంగరిస్తూనే ఉన్నారు
మీ కోపాలు , తాపాలు
మీ ప్రియతముల విరహాలు
మీ దుఖాలు ,సంసారాలూ
అన్నిటికీ నన్నో ఉపమానంగా
ఉత్ప్రేక్షగా, అలంకారంగా
అభివ్యక్తీ కరిస్తూనే ఉన్నారు
మీరు అక్షర జ్ఞానులు రాయగలరు
నన్ను పదాలలో , పద్య పాదాలలో ఇమడ్చ గలరు
ప్రతీకగా ప్రయోగాత్మకంగా ప్రయోజనాత్మకంగా ఉపయోగించ గలరు
నాలోని రేగే బడబాగ్నులు నాలో రేగే ఆనందాలను
ఏవీ చెప్పలేని నేను నా అలల ఘోష లో
మీ పాదాలు స్పృశిస్తే ..నా భావోద్విగ్నత మీకు పట్టదు
మీ ప్రేయసి చిరు నవ్వితే నేను ఆనందంగా కనిపిస్తాను
అపురూపంగా వర్ణిస్తారుమీకు దిగులేస్తే
నాలోనూ మీకు మీ దిగులే అగుపిస్తుంది
మీ కన్నీళ్ళను,మీ ఆశలను,ఆనందాలను
అనాదిగా అర్ధంచేసుకుంటూనే ఉన్నా
నిరక్ష్య రాసురాలిని మరి
ఎన్నెన్ని సార్లో
నా భావాలని
నా ఆకాంక్షలని
నా ఆవేదనని
మీతో ఒక్కసారైనా పంచుకోవాలనే
తపనతో ఏమి చెయ్యాలో
ఎలా వ్యక్తీకరించాలో
ఎరుగక ఒక్కసారి గా
ఎగిసెగిసి పడి
ఉవ్వెత్తున ఎగిరి ...
మీ దరి చేరాలని
ఉత్సాహంతో ...
ఉరకలు పరుగులు గా వస్తానా............
కానీ మీరందరూ నన్ను
తిడతారు , వంచకి నంటారు
నా గర్భంలో ని నిధి నిక్షేపాలను
కొల్లగోట్ట్టినా అడగని నేను
మీ మాలిన్యాలను మోస్తున్న నేను
ఏ ఒక్కసారీ మిమ్మల్ని ప్రశ్నించని నేను
నా ఒక్కగానొక్క భావాన్నో
ఉద్వేగాన్నో , ఉల్లాసాన్నో
చాటాలని ప్రయత్నిస్తే
అందరు అప్రమత్తమై
నేనేదో ప్రమాద కారిణి లా
భయ పడి దూరం మరింత దూరంగా
పారిపోతారు ....
నిజమే నాకు తెలుసు
నా ఆనందమూ ,నా ఆవేదనా
రెండూ మీకు మృత్యువే
అయినా వ్యక్తీకరించక ఆగలేని తనం
మీకేనా .........
నాకు మాత్రం భావ స్వాతంత్ర్యం ఉండొద్దూ ...
అని పిస్తుంది ఎన్నో సార్లు
మీ ప్రేయసీ విరహాలుగా
మీ ఆనంద ఆహ్లాదాలుగా
మీ ప్రియుని ఎడబాటుగా
కష్టాలకు ఉపమానంగా
మృత్యువుకు ప్రతీకగా
చివరికి నా వడిలోనే తనువు చాలించే
మీలో ...మీతో
నేను మృత్యువును కానని
నాలోనూ అమ్మతనం ఉందని
ప్రేమార్నవ నా వర్ణాలను
బహు నీలాల రంగుల్లో
మీకు చూపిద్దామనుకుంటా...
నన్ను నేను మీతో ....
ఏ అరమరికలూ లేక ....
నన్ను నేను ఆవిష్కరించుకుందామని
నన్నపార్ధం చేసుకోవద్దనీ
చెప్పాలనుకుంటా....
నాకు వచ్చిన భాష ఒక్కటే
మరి ఏ భావానికైనా
ఉవ్వెత్తున పొంగడం
నా భాష మీ పట్ల మృత్యు భాష
కావడం నా దురదృష్టం.....
విమోచన లేని శాపం ..!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి