పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, సెప్టెంబర్ 2012, బుధవారం

పీచు శ్రీనివాస్ రెడ్డి || నాకింకా యాదుంది ||


నాకింకా యాదుంది
కీసలో దాచుకున్న
అమ్మ ఇచ్చిన బెల్లం ప్యాలాల లడ్డు తీపి 

***

నాకింకా యాదుంది
నా లాగు రెండు తూట్లతో
దునియా చూస్తుంటే నవ్వినా కండ్లేవో 

***

నాకింకా యాదుంది
గుడ్డి దీపం సాక్షిగా
గావురంగా నాయినమ్మ ఇచ్చిన మామిడి పండు
యెంత ప్రేమగా పండిందో .

***

నాకింకా యాదుంది
పెరుగు గట్క పెట్టిన దోస్తు
పొద్దుగాల వయసుకే పోద్దీకుతే
నా కండ్లల్ల కదిలిన దుక్కం 

***

నాకింకా యాదుంది
ఇస్కూల్ల నా యాసనెక్కిరించిన
టీచరమ్మ నవ్వు 

***

నాకింకా యాదుంది
దొడ్డికాడ
బాగా సదువుకున్న బందూకు పట్టుకున్న గడ్డ పోడి ముఖం 

***

నాకింకా యాదుంది
పొలంకాడ
పాలేరు తిన్న తొక్కు మెతుకుల వాసన

***

నాకింకా యాదుంది
తాతెంబటి పోతుంటే
కులం తోకను చూసి
పక్కకు జరిగి తల దించుకున్న మనుషుల చూపు 

***

నాకింకా యాదుంది
తుమ్మ చెట్టుకు కారిన బంక
తియ్యంగ చప్పరించింది
గందుకేనేమో గురుతులన్నీ అతుకున్నై గుండెల్లో

11-09-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి