పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, సెప్టెంబర్ 2012, బుధవారం

కర్లపాలెం హనుమంత రావు ॥ అగ్గిపుల్లలు ॥


1
లేటెస్ట్ వంటకం
____________
ఓ లీటరు ప్రేమకు
రెండు లోటాలు అనురాగం, అనుమానం కలగలిపి
చెంచాడు శృంగారంతో
సెంటిమెంట్ల సెగన సన్నగ్గా ఉడకనిచ్చి
ఆనక అపార్థాల పోపు పెట్టి
చల్లారకముందే
కాసిన్ని త్యాగాలు
కడివెడు కన్నీళ్ళు కలిపి
గ్రైండర్లో రుబ్బేస్తే
టీవీ సీరియల్..అంతే!



2
కేపిటలిష్ట్
--------------------
సంపాదించిందంతా
స్టీలేజి సేఫుల్లో కుక్కి
ఎవరికీ అందకుండా
ఎత్తుగా దాచుకుందామనుకుంటే
తలకాయలు తెగ్గొట్టి
మరీ పట్టుకుపోతారని
తెలీని
కేపిటలిస్టు
కొబ్బరిచెట్టు



3
కవిగారి సేవ
---------------
బహుకాలం శ్రమకోర్చి
బహుగ్రంథ పఠనమొనర్చి
పాపం
రాశారుట కవిగారు
పురాణాలసారాన్ని
బృహత్తర గ్రంథంగా
ప్రయోజనం లేదనకండు
పనికొచ్చును అది భలే తలదిండు




4
నాదేశం
---------
ఆకాశం నిండా తారలే
ఐనా వెలుగు లేదు
నా దేశం నిండా మేథావులే
ఐనా భావి చేదు



5
ఆపేక్ష సిద్ధాంతం
-------------------
బోయవాడికి పావురాయి
మీద ఎంత ఆపేక్షో!
నూకలు చల్లుతున్నాడు
నాయకుడికి
ప్రజల మీదా
అంత ఆపేక్ష
రూకలు చల్లుతున్నాడు



6
భలే బడి
-----------
ఈ దేశంబళ్ళో
చదువేందిలా ఉంది సారూ!
ఎన్నేళ్ళు గడిచినా
ఎవళ్ళ తరగతుల్లో
వాళ్ళే వున్నారు!



7
చాయిస్
---------
న్యాయం
ధర్మం
చట్టం అంటూ
లేని వాడి వైపున్నావా
సెంట్రల్ జైల్లో
అరదండాలే
అన్యాయం
అధర్మం
దౌర్జన్యం
ఐనా
ఉన్నవాడివైపున్నావా
సెంట్రల్ పార్లమెంటులో
పూలదండలే!

(నా 'అగ్గిపుల్లలు' మినీకవితల సంకలనం నుంచి కొన్ని.మొదటిది మినహాయింపు.
-రచనా కాలం/1980-అప్పటి ఆంధ్రజ్యొతిలో ప్రచురితం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి