పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, ఆగస్టు 2012, గురువారం

వంశీ || బెస్ట్ సెల్లర్ ||


నిద్రగన్నేరు నీడన
తలబాది తవ్వితే మొలిచిన తాజా కలలు,
స్వప్న భేదనానికి ఫ్రాయిడ్నీ
తత్వ రహస్యాలకు సార్త్ర్ నీ, సాంకృత్యాయన్నీ రమ్మని,
అపరిష్కృత కాలమమ్మి కొనుక్కున్న కలల్ని,
ఎదురెదురుగా కూర్చుని
మెదడు మూలాల్లో నిక్షిప్తీకరిద్దాం,
నువ్వే నాయకుడివి,
అసంభవాల్నీ,అద్భుతాల్నీ దర్శించి
ఆనందంతో చరిద్దాం,

తొలిప్రేయసి జడ రాల్చిన గులాబీ రెమ్మలు,
తుదిశ్వాసకి సంతకమిస్తున్న మితృడి రెప్పలు,
విశ్వయాత్రకి నభస్సుకెగురుతున్న పక్షి రెక్కలు,
నీ రుధిరఙ్నాపకాల్తో గర్భోద్భవమైతున్న శైశవ రూపాలు,
ఒక్కసారి స్పర్శించి,
మనోవల్మీకమంజూషాల్లో కుడ్యచిత్రాల్లా
పదిలపరిచి తేజోన్మత్తులమవుదాం..

నీ నీడకీ కలలుంటాయేమో
పురానాగరికతలోకి జారిపోవాలని,
నీ ఆత్మకీ కలలు కావాలేమో
పొరల శరీరాన్నొదిలి పారిపోవాలని,
ఒక్కసారి అడిగి చూడు,

నిజంకాని తలరాతలు
తోడిచ్చిన నిద్రలేని రాత్రుల్నీ,
కాలిబూడిదైన అనుభవాలు
విదిల్చిన అసంతృప్త స్మృతుల్నీ,
అనస్థిత్వపు దృక్కోణాలు
మిగిల్చిన అసంబధ్దపు ఊహల్నీ,
విషాదపు క్షణాలు
శిథిలీకరించిన అశృబిందువుల్నీ బహిష్కరించి,
కావాలనుకున్న కలలు భుజాన మోసుకెళదాం
ఆలోచనల వెన్ను నొప్పి పుట్టేంతవరకు,
రావాల్సిన రేపటి రోజుని ముందే ఆవిష్కరిద్దాం
కోరికల కళ్ళు వెలుగులతో నిండేవరకు,

నిద్రగన్నేరు నీడలో
కలిసి నవ్వితే కనిపించే తాజా కలలు,
నువ్వే నాయకుడివి,
అసంభవాల్నీ,అద్భుతాల్నీ దర్శించి
ఆనందంతో చరిద్దాం...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి