పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, సెప్టెంబర్ 2012, బుధవారం

వంశీ || నిరంతరం నీ ఊహల్లో ||


ఏవో కొన్ని అత్యద్భుత అమలిన క్షణాలు తప్ప
నేనెప్పుడూ నిన్ను ప్రేమించలేదు
చాలాసార్లు మోహించాను
ప్రతీసారీ కామించాను,
నిన్ను తాకినపుడు నేనెలాంటి
అభౌతికాలౌకికానందానికీ లోనవ్వలేదు,
బహుశా నీకనిపించిందేమో..

నువ్ నాలా కాదని నమ్మి,
నేన్నిన్నెపుడూ ప్రేమించలేదేమో..
నీ దూరమే నేర్పింది
ప్రాధాన్యతలూ, వస్తు విశేషాలూ
నిరంతరం రూపుమార్చుకుంటాయని,
కాసేపు నీ సమయాన్ని బుజ్జగించో బెదిరించో
నా స్థలానికి రా
నా కాలమాగి చాలా కాలమైంది,
నా చెంపనో గుండెనో గాయాల్తో సంగీతీకరించు కోపం తగ్గేదాకా,
ఇన్నాళ్ళ నా కన్నీటికి కారణం దొరుకుతుంది అపుడైనా..

వీలైతే
నేననుభూతించని అనుభవాల్ని దోసిళ్ళలో నింపుకురా,
తలంటుపోసుకుని ప్రాయశ్చిత్తుడనౌతా,
మరలిపోకు, నేన్నిన్ను గుర్తించలేకపోతే
అందని ఆకాశం అందుకున్నానన్న తృప్తి
మిగుల్చుకోడానికి నాకిదే చివరి అవకాశం,

గుర్తుందా, నువ్వనేదానివి,
"నేను మరణిస్తే ఏం చేస్తావ్" అని,
నవ్వొస్తోందిపుడు
సగం చచ్చిన నాకోసం నిన్ను రమ్మని అరుస్తుంటే,
శరీరమూ కంపిస్తుంది,నువ్ నిజంగా వొస్తే
నాలో నాకు తెలీని మార్పుల్ని నీ నవ్వులో వెతుక్కుంటూ
మళ్ళీ జన్మించేట్టు నిన్నోసారి కౌగిలించుకోకుండా ఉండగలనా,
అప్పటికీ నేన్నిన్ను ప్రేమించలేక కామిస్తూనే ఉంటే
నన్ను నేను చంపుకోక ఆగగలనా..

నిన్నటంత పవిత్రంగా నేడు చూడగలనా
వేరొకరు తలదాచుకుంటున్న
వేడిశ్వాసలొదిలే నీ ఊపిరుల్ని,
వొద్దొద్దు,
నేనెప్పటికీ నాలా చూడలేనిక,
నీలా ప్రేమించనూలేను..
వంతెనలేని శూన్యానికి అటు నువ్వు, ఇటు నేనై..

నీకూ నాలా అనిపించట్లేదూ,
ఎన్నడూ కనపడని పొరల్ని దాటి
నా అసలు నేను నీముందుకొస్తుంటే
కించిదనుమానమైనా కలగడంలేదూ..

మనమెన్నటికీ సమాంతర రేఖలమే
పరస్పరాలోచన్ల తిర్యగ్రేఖ దిగంతం దగ్గర
మనల్ని కలిపే సాహసం చేయనుందా,
బ్రతుకు బరువుకు పాతాళంలో పాతుకుపోయిన చూపుల్తో
రేపటి నిన్ను ఊహించుకుంటూ
విశృంఖల శృంఖలాల్లో పోగొట్టుకున్న రక్తస్పర్శల్ని
తిరిగి నావైపు మళ్ళించుకుంటూ,
అదిగో కనిపిస్తుందా అనంతం,
కలుద్దాం అక్కడే,
అప్పుడైనా నేన్నిన్ను కామించకుండా ప్రేమించగలనా..

4.9.12

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి