పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

వంశీ // మెటమార్ఫసిస్ //

ఎపుడైనా,
ఎన్ని యుగాలింకా నేలలోనే మొలకెత్తాలని
లేని రెక్కలు అతికించుకుని ఎగరాలనుకున్నావా,
చీమనో దోమనో ఆవహించి
సగంమిగిలిన రంధ్రాన్వేషణ సాగించాలనుకున్నావా,
అతీంద్రీయాల్ని ఆవేశించుకుని మనుషుల్ని
మృగాలు చేసే అమృతత్వం సాధించాలనుకున్నావా,

ఎపుడైనా

విరుస్తున్న గులాబీతో
మురుస్తున్న తుమ్మెద తొలిమాటలు వినాలనుకున్నావా,
కురుస్తున్న చినుకు తాకి
కరుస్తున్న చలిని విడదీయాలనుకున్నావా,

పరారుణకిరణాలెక్కి

అరుణగ్రహంమీద గడ్డకట్టిన సమయాన్ని
భాష్పీకరించి ప్రవాసుడివవ్వాలనుకున్నావా ,
స్రవించే శోకాలు
సమీపించని సుదూర వ్యోమతీరాన
గమించి క్షయించే నక్షత్రాన్ని ఓదార్చాలనుకున్నవా,

నీ ఉద్వేగాలకు మూలమైన రసాయనచర్యలో

ఉత్ప్రేరకమేదో తెలుసుకుని
ఉద్దేశాలు మార్చుకోవాలనుకున్నావా,
పరస్పర విరుధ్దాలైన నీ
అంతర్ముఖాల పూర్వవృత్తాంతాల
నిజనిర్ధారణకు భ్రూణంలోకి ప్రయానించావా..

ఒకరినొకరు తోసుకుని దాటుకుని

చేరే చివరిమజిలీ చీకట్లోంచి శూన్యంలోకే అనిపించిందా,
కోట్ల అనుభవాల్తో నిర్మించుకున్న నీ ప్రపంచం
నిన్నెపుడైనా ఒంటరిని చేసి ఏడిపించిందా..

చీకటి నాకేసిన వెలుగుల్లో

నిశ్శబ్ధంగా పారుతున్న వీధులగుండా
రాతియుగపు సంగీతం పీలుస్తూ, ఒడ్డుచేరక
నడిసముద్రపు శక్తిస్థలిలో మునగాలనిపించిందా,

బలహీనతల సర్దుబాట్లతో

చిర్నవ్వు తారసపడ్డా అందుకోలేని దురదృష్టాల్ని
కలిపి కుట్టుకున్న చర్మపు పొరల్ని
ఒక్కొక్కటే వొలుచుకుంటూ నీకు నువ్
నగ్నంగా నిజంగా పరావర్తనం అవ్వాలనిపించిందా..

నన్ను ఙ్నప్తించుకో మిత్రమా

నీకలా అనిపిస్తే,
కనీసం నన్నో ఆలోచనలాగా ఐనా గాల్లో కలిపెయ్,

నేను,

అస్థిత్వపోరులో
నాగరికతలు మారుతూ పునరుద్భవిస్తున్న నడిచే శవాన్ని..

5.9.12

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి