నడిఝాము దాటిన చీకటిని
నిశ్శబ్దం విరహించే ప్రతిరాత్రి
నిద్రించాయనుకున్న కలలు మేలుకుని
సమస్తాన్ని అచేతనం చేసే
అద్భుతాన్ని అక్షరీకరించాలని గింజుకునే
ప్రయత్నం ఆపుతూ, దూరంగా
కపాలమోక్షానికి ఉలిక్కిపడ్డ పాపాలభైరవుడి
భూపాలపు మేలుకొలుపు..
గాలివాటుకు ఫెటీల్మని శబ్దించి
సర్దుకుంటున్న కిటికీ విన్యాసానికి వెన్ను
ప్రచోదించిన భయమూ బిడియమూ కాని
ఒక ఆనందావస్థపు మహామౌనంముందు మోకరిల్లి
అస్పష్టంగా అల్లుకుపోతున్న ఆలోచనల్ని
తర్జుమా చేయలేని ఓటమిని అంగీకరిస్తూ..
గతమెపుడో పలుమార్లు పరిచయించిందనిపించే
ఈ అనుభవాల లోతుల్లో ప్రాయోపవేశించి
ఊపిరాడని చెమ్మల తడిని
ప్రత్యూషపు తొలి తెలికిరణపు ఎండపొడ
సడిచేయక తుడిపేస్తున్నట్టనిపించే
పొడుగైన రాత్రిని, పడదోసి పడకేసిన ఊహలు
మంచమ్మీద నాతోపాటుగా,
సుషుప్తిని మింగిన నీ గదిలో నేను,
నిజాయితీగా నిశీధిన కరగలేని అశక్తతకు
నీ ఓదార్పునడిగి ఓ దారి వెతుక్కోవడానికి,
మరో ప్రవాసపు ప్రదోషపు పునాదులో
సుదూరపు అసహజ గవాక్షాలో
ఉదయించకముందే
నాలోనూ నిదురించు..
23.9.12
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి