H.I.V పాసిటివ్,
వెస్టర్న్ బ్లాట్ అబధ్దాల్చెప్పదు,
ఏడవాలనుందోసారి, చస్తానని
తెల్సినా కన్ను తడవనీని గుండెదే ధైర్యమో,
నన్నెవరైనా చంపరూ
రేపుని చూడనీక, ఈ రాత్రిలోనే ఉండేట్టు..
"గ్రీఫ్ రియాక్షన్"
డినైల్, యాంగర్, బార్గెయిన్,డెత్ ఫియర్,యాక్సెప్టాన్స్..
ఆ దశలేవీ చూడకనే అంగీకరిస్తూ,
పుణ్యకార్యమేం కాదుగా చేసింది,
ఆర్నెల్ల కింద గోవాలో పాపం,
పెరిగి పండై పగిలి ఇలా..
సంతాపసభలో
నా చావుక్కారణం ఏమంటారో,
ఉప్పునీళ్ళు నరాల్లోకెక్కించుకునా,
ఆక్సిడెంట్లో శరీరం ఛిద్రించుకునా,
ఉరేస్కుని మృత్యువు ముద్రించుకునా,
విండో పీరియడే, ఇంకా రెండేళ్ళకు
ఇమ్యునిటీ తగ్గి రోగాలు, బరువు తగ్గి భయాలూ..
అందుకే చంపడ్నన్నిప్పుడే,
ఐ కాంట్ కిల్ మైసెల్ఫ్..
ఆలోచన్ల అలజడి కంట్లో మేఘాలు కదుపుతూ..
"పాపానికి ప్రాయశ్చిత్తం లేదు
నివారణొకటే మార్గం"
మొన్న కొన్న స్కోడానీ,
మందులో కలిపిన సోడానీ,
కావాల్సిన భవితనీ,
రావాల్సిన అనుభవాల్నీ,
చేయాల్సిన పనుల్నీ,
చూడాల్సిన కలల్నీ, వొదిలి
మహాప్రస్థానానికి కదుల్తూ,
సినిమాలో చివరి రీల్ మొదలైనట్టు..
రక్తంలో వైరస్ వీరవిహారం తెలుస్తూ,
నిజానికదీ నేనూ ఒకటే,
విశృంఖలతే, స్రావాల్లో సుఖిస్తూ,
లోకం చిలకరించే చిల్లర జాలినీ,
సంఘం దయతల్చిచ్చే ప్రత్యేక గుర్తింపునీ చేరకముందే,
నానుండి మరొకరికి వ్యాధిసంక్రమణం చేయకముందే,
చంపడ్నన్ను, ప్లీజ్,
యూథనేషియా,
యూథనేషియా..
*21.8.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి