మరి-
ప్రేమసంగతో బుల్‌బుల్?
అదెందుకు దాస్తావ్?
పక్షిలా పాడగలిగినందుకు
పాడుతూ అరవగలిగినందుకు
ప్రేమించబడ్తావ్.
పువ్వుల్ని ఊహించనందుకు
వెన్నెల్ని మోహించనందుకు
ప్రేమించబడ్తావ్.
పొద్దుటి అడవిపిట్ట మొదలు
రాతిరి పెద్దపిట్టదాక
-నువ్వు ప్రేమించబడని
క్షణమంటూ ఉండదు
మాపటి కొంగలు మొదలు
చీకటి చకోరంవరకి
-మాట్లాడుకోని
సమయాలూ ఉండవు.
ఎందుకని ఎన్నడూ ఆలోచించవ్.
చెప్పేంత పిచ్చితనం దానికీ ఉండదు.
కొన్నిరోజులు బాగానే గడుస్తాయ్.
భారంగా మరికొన్ని-
ఎటెల్లేది, ఎందుకనేది
ఆలోచించని మత్తులో
పూలగాలికి తేలిపోతు
ఇంకొన్ని..
***
అప్పటివరకి అంతా మంచే-
అనుకోకుండ ఏదో చిక్కొచ్చి పడుతుంది.
ఋతువెలా మారేది తెలీదు!
ఎన్నోరోజుల ఏకాంతాన్ని
కాలరాసిన నీకు
శిక్షపడే కాలమొకటిరానేవస్తుంది.
వసంతపుకోయిల,వర్షపు చక్రవాకం
నీ గుండెలమీదుగా ఎగిరెళ్ళిపోతాయ్.
వగపు కోరికలు,వయసు నెమళ్ళు
దేహంనిండా పురివిప్పుతాయ్.
పూలగాలికి తేలిపోయిన నువ్వు
ఒక్కసారిగా- నేలకూలుతావ్.
వెన్నెల సిద్దాంతాలు రాసిపోసిన నువ్వు
చీకటి చివరంచుకి విసిరేయబడ్తావ్.
పొద్దుతిరుగుళ్ళ ప్రేమ
ఇదంతా పట్టనట్టే కనిపిస్తుంది.
కానీ,కాలానుగుణంగా చలించడం
దానికీ తప్పదని తెలుసు నీకు!
***
తర్వాతేమవుతుందో తెలుసుగా?
పక్కనే ఉండలేనందుకు
గూటిలో జాగలేనందుకు
ద్వేషించబడ్తావ్.
పువ్వుల్ని తెంపనందుకు,
వెన్నెల్ని తాకనందుకు,
ద్వేషించబడ్తావ్.
ఉన్నొక్క యవ్వనం తీరకముందే
తేలిగ్గా నీ కధ
చివరి మలుపు తిరుగుతుంది.
రెక్క పొడుగనో,ముక్కు పదుననో
కాళ్ళు కదల్లేదనో,గోర్లు పెరగలేదనో
కారణాలేవైతేనేం?
నువ్వు ద్వేషించబడ్తావ్.
నిర్ధయగా వెలివేయబడ్తావ్.
కధ ముగిసిపోతుంది!
***
బుల్‌బుల్-ఆగిపోకు..
విను..
కధలో చివరి సందేశాలు
విచిత్రంగా ఉంటాయ్.
మూడు కాలాల్ని విరిచి,
మూడు చావులకి ముద్దుపెట్టి,
మూడుముళ్ళు వద్దని,
ముసుగేసి పడుకున్న నిన్ను-
పాలపిట్ట రంగనీ,జిట్టంగి చూపనీ,
వడ్రంగి పట్టనీ,నిద్రలేపిన తను-
పగల్ని,రాత్రిని
వెన్నెల్ని,చీకటిని
నిర్లిప్తంగా నిర్ధారించి
నిశ్శేషంగా విభాగించి
వెన్నెల రహస్యం వెన్నెలకి,
చీకటి రహస్యం చీకటికి,
నిశ్శబ్ధంగా,నిజాయితీగా
నిష్కామంగా పంచమంటుంది.
ఇంకా..
నీరెండకు దాగిపోవడం పిరికితనమని
నిప్పులగాలికి ఎదురుపోవడం మగతనమని
చిరుజల్లుతో సర్దుకుంటే పాపమని
జడివానకి తడిసిపోవడం మోక్షమని
చలిగాలికి వణికిపోతే ఓటమని
చచ్చైనా గడ్డకట్టడం గెలుపని
నేర్చుకొమ్మంటుంది.
ఇంకా ఇంకా-
ఏం కావాలి నీకు?
గూడుకట్టే తెలివిలేక పదేపదే
ఎగిరిపోయే నీకు?
మోసపోయే నీ బతుక్కి?
అనుభవించు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి