పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, ఆగస్టు 2012, బుధవారం

నంద కిశోర్ || గమనం ||

కాలేగచ్చుపై కుంకుడు గింజలు గీకి
నాకు తెలీకుండా నువ్వు, చురుగ్గా అంటించినపుడూ-


పరికిపొదల్లో గుచ్చిన ముళ్ళని
నొప్పి తెలీకుండా నేను, సుతారంగ తీసినపుడూ-

ఎరుకే తెలీనంతగా ఎగురుకుంటుపోయి
పంటకాల్వలపై మనం పరుగెత్తినపుడు..

ఎర్రటిమధ్యాహ్నం మనం భూతద్దపుచేతుల్తో
రెండు పచ్చి అగ్గిపుల్లల్ని వెలిగింపజూసినపుడు..

కళ్ళకి తెలీని కాంతి భాషతో,
కాళ్ళకి తెలీని స్పర్శ భాషతో,
ఇద్దరం నిశ్శబ్ధంగా మాట్లాడుకున్నప్పుడు,
మాట్లాడ్తూ మరిచిపోయినప్పుడు,
మాట్లాడి మాట్లాడి కరిగిపోయినప్పుడు..

ఓహ్!
ఒక పసికాలం పరిసమాప్తమయ్యేలోపు
ఒక ఎండ మనల్ని పరిపూర్ణుల్ని చేసింది.

***
తెల్లటి మేఘాల పరిమితుల్ని దాటి
నీ హృదయాలు నాపై వర్షించినపుడూ-

కాగితప్పడవలో కదలకుండా కూర్చొని
ప్రవాహల్నిదాట నే ప్రయత్నించినపుడూ-

ముసురుపట్టిన రాత్రి, ముద్దులనిద్రలో
మురిసిపోతు నిన్ను కలగన్నపుడు..

కలగంటు,కవ్వించుకుంటు కౌగిళ్ళవాగులో
కనపడకుండానే మునిగిపోయినపుడు..

చేతులకి చెందని సంజ్ఞలసవ్వడితో,
చేతలకి అందని సందేశాలసంగీతంలో,
ఇద్దరం మధురంగా పాట పాడినపుడు,
పాడుతూ పరవశించినపుడు,
పాడి పాడి గొంతు మూగబోయినపుడు..

ఆహ్!
ఒక యవ్వనం పూర్తిగా తడపకముందే
ఒక వాన మనల్ని ఆకాశాల్ని చేసింది.

***

మంచు దారుల్లో అరచేతులు రుద్దుతు
వెచ్చటి జ్ఞాపకాలపై అడుగేసుకుంటూ-

చల్లటి శీతగాలికి దేహాల్ని అడ్డేస్తూ
మనల్ని మనంగా కాపాడుకుంటూ-

బాసలు,బాధ్యతలు లేని కొత్త లోకం ఒకటి
నాకోసం నువ్వు, నీకోసం నేను సృష్టించుకుంటూ..

మనసు హృదయం తెలియని మార్మికజ్ఞానంతో
మనల్ని మాత్రమే మిగుల్చుకుంటూ..

చరిత్రలడగని ఆలోచనల పరంపరలో,
గణితాలెరగని చీకటి మైదానాల్లో,
ఇద్దరం హాయిగా ఆడుకుంటూ,
ఆడుతూ అలసిపోతూ,
ఆడుతూ ఆడుతూ అంతమయిపోతూ..

__!
ఆశ్చర్యానికి పదాలు లేని చలిలో
ఈ జీవితం గుట్టుగా ముగించాలని ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి