నారీ....నిను రక్షించేవారేరీ!!! || పద్మా శ్రీరామ్|| హనుమజ్జయంతి....ఎండకన్నె ఆయన కోపంలా ఎదిగి ఎదిగి రాముని నామం విన్న హనుమయ్యలా మెల్లిగా చల్లబడుతున్నవేళ.... కోటీలో బయలుదేరిన బస్సు నిండుగర్భిణిలా మెల్లగా నడుస్తోంది... ఉన్నట్లుండి ట్రాఫిక్ జామ్...డప్పులతో గెంతులతో గుంపు ఎదురైంది. దేవుని ఊరేగింపనుకుని అర్జెంట్ గా కళ్ళు మూసేసుకుని (దేవుణ్ణి చూడకూడదనా, దేవుడెదురుగా ఉన్నాడనే మూఢభక్తా...) ఓ దణ్ణఁవెట్టేసుకున్నా. కళ్ళు తెరిచి చూసేసరికి దేవుడు కాదు...ఆయన సన్నిధికేగుతున్న ఓ జీవుడు. హ్మ్... అదృష్టవంతుడు డైరెక్ట్ వైకుంఠానికేగాడు అనుకుంటూ వెన్నంటి వస్తున్న మహిళల గుంపు చూసి ఉలిక్కిపడ్డాను. నలుగురు పెద్ద ముత్తైదువలు ఆ వెనుక ఓ పెద్దామె చేతుల్తో పొదివి పట్టుకున్న ఒక పదిహేనేళ్ళ పిల్ల. ఎర్రని చీర కట్టి నుదుట పావలాకాసంత సింధూరం దిద్ది మెళ్ళో మల్లెల దండ తలపై పూలతో చేసిన టోపీ... అంటే...అంటే.....అంటే....ఆ పిల్ల.... తాళిబొట్టంటే అదేదో గొలుసనుకునే వయసు. తనకి ఏం చేయబోతున్నారో తెలియని మనసు. మెళ్ళో దండ సర్దుకుంటూ...మామ్మతో అడుగులు వేస్తున్న ఒక బలి పశువు...ఊరేగింపులో స్నేహితురాళ్ళు వెనక వరసలో ఉన్నారు కాబోలు మాటిమాటికి వెనక్కి చూస్తూ అంధకారమని తెలియని జీవితంలోకి ముందుకడుగులేస్తూ.... బస్సులోంచి చూస్తున్న మహిళలందరికీ కళ్ళనీళ్ళొచ్చాయి కానీ నాకు రాలేదు. ఏదో నొప్పి ... చూపు తిప్పనీయక ఊపిరాడనీయక .... ఇల్లు చేరగానే విపరీతమైన తలనొప్పి. కళ్ళముందు ఎదపై తాళితో తొక్కుడుబిళ్ళాడుకుంటున్న పాపలు....తెల్ల చీర సర్దుకుంటూ నడవలేక (జీవితాంతం) బొక్కబోర్లా పడుతున్న పసి కూనలు.. ఎటు పోతున్నాం మనం ... మళ్ళి మరో వీరేశలింగం , రాజారామ్మోహన్ రాయ్ పుట్టాలా? వీధికెక్కి చేసే పోరాటాలన్నీ ఆర్ధికాలేనా...హార్ధికాలెప్పుడొస్తాయ్ !!! సంప్రదాయాలు సముచితమే అక్రమాలు కానంతవరకూ. పైగా అవి పది మందికీ ఊరేగింపుగా చాటిస్తూ చేసే సంబరాలా? జాతర్లలో బలిచ్చే మేకపిల్ల బ్రతుకే నయం ఒక్క వేటుతో బ్రతుకు భారమంతా హాంఫట్....కానీ ఈ ఆడపిల్లలు ? ఎప్పటికి ముగిసేనీ వింత అయోగ్య అక్రమ క్రతువు ? చిట్టికూనా ...నీకిక ఇదే జీవితమా... 16 Apr 2014
by Padma Sreeram
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mbZrxp
Posted by Katta
by Padma Sreeram
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mbZrxp
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి