యాకూబ్ | కుడికాలు ........................... అలిసిపోతున్న నాకు మళ్ళీ ఇలా ఆశలా ఎదురయ్యావు కలలులేని రాత్రిలో సేదతీర్చే కవితలా మారావు రహస్యాలు లేని రోజులకు నీవే రూపశిల్పివయ్యావు కవియోధుని కాపాడే ఊహవయ్యావు. భావుకతవయ్యావు గాయపడిన దేహంపైన వాలిన అమృతహస్తంలాంటి పక్షివయ్యావు వసంతంలా భూమిని వరించిన రంగురంగుల నవ్వువయ్యావు సీతాకోకచిలుకలా మారిన రూపాంతర జీవనపరిణామానివయ్యావు. * ఊడుగుచెట్లు, పల్లేరు కాయలు, నల్లవాగులో నా రక్తం పీల్చిన జలగలు, మంచెల మీద నేనల్లిన పాటల గమకాలు, నోరూరించిన తుంగలు, తలలూపే జొన్నకంకులు,.. అన్నిటా తొంగి చూసిన అద్భుత, చిత్ర విచిత్ర భావాల మిశ్రమపు బతుకు పుప్పొడివయ్యావు. సానబట్టిన ఉలిలాంటి నాలోని కాంక్షవయ్యావు నా నిద్రించిన రాత్రుల్లో దోగాడిన పసి యవ్వనానివయ్యావు చిగిర్చే చింతచిగురుమీద ప్రకృతి గీసిన భవిష్యత్తు ఆకుపచ్చదనానివయ్యావు * అద్దం ముందునిలబెట్టి నన్ను నాకు చూపించిన ఆత్మవయ్యావు. మా అమ్మ ముఖం ముడతల్లో తొంగిచూసే వాత్సల్యపు మెరుపువయ్యావు. చెవుల్లో గింగిర్లుపోయే మా నాన్నగొంతులోని కూనిరాగంలా నా హృదయాన్ని తాకే అద్భుత వాహికవయ్యావు * ఎంత కరుణ ఎంత ప్రేమ ఎంత వాత్సల్యం నీకు ! నీ కుడికాలు నా జీవితపు వాకిలిలో మోపినప్పుడే నేను అపూర్వమైన ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడాను నా మనసుకు తొడిగిన స్వప్నాలకు నీవిచ్చిన అర్ధంతోనే నేను కవినయ్యాను. # *పాతవాచకం - 5.2.2001/16.4.2014
by Kavi Yakoob
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qJuToF
Posted by Katta
by Kavi Yakoob
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qJuToF
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి