విస్మృతగీతం నువ్ గాంచిన స్వప్నమొకటి నా ముందు మోకరిల్లి ఉంది.. జీవచ్ఛవమై, రెక్కలు తెగి, కొన ఊపిరితో... నువ్ ఎత్తిన బావుటా ఒకటి ఎండిన కట్టెగా మిగిలింది.. చీలికలై రెపరెపలాడుతూ.. వాలిన దుమ్ము దులిపేసుకుంటూ.. నువ్ పాడిన గేయమొకటి గాయమై మిగిలింది ఉఛ్వాస నిశ్వాసాలను స్వరాలుగా విడదీస్తూ.. ఏకాకి శరాలుగా మరణిస్తూ.. నువ్ సంధించిన బాణమొకటి గురితప్పి నా గుండెల్లో పాతుకుంది. నా కులాన్ని ధ్వనిస్తూ నాలో అశాంతిని రగిలిస్తూ నువ్ వెలిగించిన దీపమొకటి దావానలమై అంటుకుంది లక్ష్యమేదో తెలియని యజ్ఞానికి తరతరాలను సమిధలుగా మారుస్తూ.. ఓ మనూ... నువ్ సృజించిన బీభత్సంలో చివరి శకలాన్ని నేను నీ కుల వ్యవస్తలో చివరి శిథిలాన్ని నేను.. నీ అరికాలిని చేరిన మస్తిష్కంలోంచిపుట్టిన వాడిని భూస్థాపిత పునాదిరాయిని నేను.. కులక్షేత్ర పద్మవ్యూహంలో ఒంటరి అభిమన్యుడిని నేను అంబేద్కరుడిని నేను.. సహస్ర శీర్ష కుల సర్ప పరిష్వంగం చీల్చుకు వస్తున్నాను.. ద్వారపాలకులే జాతి పీడకులై పాతాలంలో తొక్కి పెట్టిన వేదామృతాన్ని వెలికి తీస్తాను.. ఓ మనూ... నీ కలం బలాన్ని నాకివ్వు నీ కలల ప్రపంచానికి నాందీ వాచకం రాస్తున్నాను నీ మనుస్మృతిని సరిదిద్ది మా నవ స్మృతిని నిర్మిస్తున్నాను.. ...అంబేద్కరుని స్మృతిలో చిన్నికృష్ణ
by Chinni Krishna
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1dvao
Posted by Katta
by Chinni Krishna
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1dvao
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి