యశస్వి*పొసగని కాలంలో..* సమాధానం చెబుతాను.. అడిగింది నువ్వే.. నమ్మడం మాట దేముడెరుగు వినిపించుకోవు.. మరి అడగడమెందుకో అర్థం కాదు.. రోదిస్తావ్!.. బాధిస్తావ్.. సాధిస్తావ్ నా మనోఆకాశాన్ని చిందరవందర జేస్తావ్ నే ధ్వని కాలుష్యాన్ని, పదకాలుష్యాన్ని ఆశ్రయిస్తాను. ఒకరికి పట్టిన దెయ్యాన్ని వేరొకరు వదిలించాలని చూస్తాం సమాధానపడడం సాధ్యం కాదు పరిస్థితి విషమిస్తుంది. కొన్ని క్షణాలు మరణిస్తాయి మన మధ్య చీకటి పరుచుకుంటుంది. నువ్వు అంతఃపురంలో విశ్రమిస్తావ్ నే సమాధిలోకి దారి వెతుకుతుంటాను. కీచురాళ్ళు రొదపెడుతూనే ఉంటాయి. కాలం అకాలంలో శమిస్తుంది మరోనిముషానికి శపిస్తుంది ఏదోశక్తి ఇద్దరినీ పరీక్షిస్తుందని ఎవరో ఒక్కరికే అనిపిస్తుంది ప్రాణం పాతరోజులకై పరితపిస్తుంది అందని ఏకాంతం పరిహసిస్తుంది దిండు తడుస్తుంది రాత్రి గడుస్తుంది.. పొద్దు పొడుస్తుంది నిట్టుర్పు విడుస్తుంది ఇద్దరి మధ్య ప్రేమ.. మౌనంలో పురుడుపోసుకుంటుంది అహంలో ఊపిరితీసుకుంటుంది ఇచ్చిపుచ్చుకోవడంలో తీరాలు దాటిస్తుంది అంతరాలు పాటిస్తుంది మాటల్లో ఉరితీసుకుంటుంది చేతల్లో కసిదీర్చుకుంటుంది రాతల్లో ఓదార్చుకుంటుంది ప్రేమ అమరం.. కదా! తను మాయమై..మనసుల్ని చంపేస్తుంది.. మనుషుల్ని మాత్రం కొన ప్రాణాలతో నిలిపే ఉంచుతుంది.. అదేమంటే.. కలసి జీవించడం కావాలి కదా అంటుంది. == 26.3.14==
by Yasaswi Sateesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QfuPAC
Posted by Katta
by Yasaswi Sateesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QfuPAC
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి