అక్షరాలైన అభాగ్యుల వెతలు - కె.వరలక్ష్మి కథలు ఒక గొప్ప పుస్తకం చదవడం ముగించి రసావేశానికి లోనై నిదురకు దూరమైన రాత్రులు, మరుసటి రోజు మామూలు మనిషి కాలేక పోయిన సందర్భాలు సాహితీ రసజ్ఞులైన పాఠకులకు కొత్తేమీ కాదనుకుంటాను. ఆ కోవకు చెందినవే కె.వరలక్ష్మి గారి కథా సంకలనాలు. పఠనీయత పుష్కలంగా ఉన్న ఒక్కో కథా సంకలనం చదవడానికి రెండింతల సమయం పట్టిందనడం విరోధాభాసం (paradox). కాని, కె.వరలక్ష్మి గారి కథా సంకలనాల చదువరికి ఈ అనుభవం తప్పదు. చదువుతున్నంత సేపు పరుగులెత్తించిన కథాంతం మరో కథను ప్రారంభించనివ్వదు. ఆలోచనల అలజడి ముందుకు కదలనివ్వదు. ఈ లక్షణం ఒక మంచి రచనకు గీటురాయని నేను భావిస్తాను. కె. వరలక్ష్మి గారి కథాసంకలనాలు మూడు-- జీవరాగం(1996), మట్టి-బంగారం (2002), అతడు-నేను (2007). ఈ మూడు సంకలనాలలోని కథల సంఖ్య 47. ఈ కథలన్నీ అరుదైన ఆణిముత్యాలు. వీటిలో చాలావరకు స్త్రీ ఇతివృత్త కేంద్రంగా స్త్రీ చుట్టూ తిరిగిన అట్టడుగు అబలల దయనీయ జీవన దృశ్యాలు. ఈనాటికీ సమాజం లోని సగటు స్త్రీ అనుభవించక తప్పని అనేక వాస్తవ సమస్యల సమాహారాలు. స్త్రీసున్నితమైన జీవరాగాల సందడి! ఈ కథలలో అణగారిన నానాజాతి స్త్రీల దైన్యజీవితాలు చదువరులను కలవర పరుస్తాయి. కుటుంబ హింసను, సామాజిక హింసను భరిస్తున్నామన్న స్పృహే లేని వెనుకబడిన స్త్రీలు నిస్సహాయంగా కొట్టుమిట్టాడుతూ కలతను రేపుతుంటారు. ఎరుకల, చాకలి, గొల్ల, మేదర, తప్పెటగుళ్ళ, పొడ పోతల, భోగం, కోయ, గిరిజన నిరుపేద స్త్రీలు దీనంగా కళ్ళముందు నిలిచి నిలదీస్తారు. ఇన్ని రకాల జీవితాల చీకటి లోతులను ఇంత దగ్గరగా తరచి చూడడం, దయనీయమైన వాస్తవ జీవితాలను ఇలా మమేక మానవీయ దృక్కోణంలో దర్శించడం పరిశీలను మించిన పరిశోధన! వరలక్ష్మి గారు ఒక 'కథా బీజాన్ని' ఎన్నుకొని, స్థూలంగా ఒక 'కథా చట్రాన్ని' మనసులో నిలుపుకొని, కేవలం ఒక 'రూప స్పృహ'తోనే కథను ప్రారంభిస్తారేమోననీ, 'క్లుప్తత', 'అంతస్సూత్రత','శైలీ శిల్ప విన్యాసం', 'ఉత్కంఠత, 'కథా సంవిధానం', కొసమెరుపులను ఆవిష్కరించే 'అద్భుతాంశ' వంటి ప్రక్రియాపరమైన కథానికా లక్షణాలు వాటంతటవే 'కథా కథన' గమనంలో ఒదిగిపొతాయనీ నాకెందుకో అనిపిస్తుంటుంది. ఆమె కథలు రాస్తున్నట్టుగా కాకుండా, స్వతసిద్ధ మైన సహజ ప్రతిభతో అలవోకగా వినిపిస్తున్నట్టుగా ఉండటం అందుకు కారణం కావచ్చు.'ఎత్తుగడ' తోనే ఆమె కథా సరిత్సాగరం లోకి లాగబడిన పాత్రోపస్థిత శ్రోత అయిపోతాడు పాఠకుడు ! ఇక కథల్లోకి వస్తే --'జీవరాగం' ఉత్తమ పురుషలో రాసిన ఒక చిన్న కథ. 'అమ్మపోయింది, కూతురు ప్రేమించిన వాడితో రిజిష్టర్ మారేజ్ చేసు కుంది.చచ్చి పోవాలని అనిపిస్తుంది' అంటూ ఎంతో బాధతో సత్యమూర్తి రాసిన ఉత్తరం అందుకున్న శృతి హుటాహుటిగా బయలుదేరింది. తీరా అతని ఇల్లు చేరే సరికి కూతురు పెళ్ళి ఘనంగా చేసే పనుల్లో పెళ్లి పందిట్లో తలమునక లౌతుంటాడు అతడు.తల్లి చావును మరచిపోయి ఎక్కడ చూచినా తనేఅయి హుషారుగా నవ్వుతూ తిరుగుతుంటాడు.ఇతనేనా అంత ఆర్తితో రాసిన మనిషి! 'ఒక్క బ్రేక్ తో ట్రెయిన్ కదలి స్పీడందుకుంది .ఉత్తరం చింపి బయటకు విసిరేశాను'. ఇవి ముగింపు వాక్యాలు. మూర్తి ప్రాక్టికల్ మనిషి అని కథ మధ్యలో రచయిత్రి సూచించి వదలుతుంది. అది 'నాందీ-ప్రస్తావన' అని కథాంతానికి గాని అవగాహనలోకి రాదు. ప్రాక్టికాలిటీ ముసుగు కప్పుకున్న హైపోక్రటిక్ మనిషి నేటి సగటు సంఘజీవి అని చెప్పడం రచయిత్రి ఉద్దేశమై ఉంటుంది. ఇలాంటి వాళ్ళెందరో తన కథల్లో ఉన్నందువల్లే సంకలనానికి 'జీవరాగం' అని పేరు పెట్టిందనుకుంటాను. 'మట్టి-బంగారం' మాండలికంలో సాగిన మరోసంకలనంలోని మరో కథ. గొల్లల పండుగ పబ్బాల, వ్రతాల, ఆచారాల పల్లె వాతావరణం. అయోద్ది రాముడు గొర్రెలను అమ్మి పెంకులు తయారు చేసే మిల్లులో వాటావుంటానంటే 'ఎవడన్నా పేణం ఉన్న జీవాలమ్ముకొని పేణం లేని మిల్లు కొనుక్కుంటాడట్రా ?'అని ముసల్ది మందలిస్తుంది. అయినా ఖాతరు చేయకుండా ఫాక్టరీ కొనేస్తాడు. తన గుడిసె పక్కనున్న మరో మూడు గుడిసెలు కొని పడగొట్టించి పెద్ద మేడ కట్టిస్తాడు. ఆ మేడ 'మందలో తలెత్తి నిలిచిన కొమ్ముల పొటేలులా ఉందని' సంబరపడిపోతుంది అక్క శ్రీలక్ష్మమ్మ. ఆడంబరాలకూ డాబులకూ పోయి దివాలా తీస్తాడు అయోద్ది రాముడు. మిల్లుకు తాళం పడుతుంది. ఇల్లు అమ్ముడై పోతుంది.' మన అయోద్ది రాముడు మట్టిలో పుట్టిన మాణిక్కంరా, ఆడు మట్టట్టుకుంటే బంగారవై పోద్ది' అన్న పెద్ద గొల్లతాత 'బంగారాన్ని మట్టి సేసేవురా అయోద్ది రాముడూ' అంటూ వాపోతాడు.కథ పొడుగునా వస్తువుకు తగిన శైలీ, ప్రాంతీయ గొల్లల జీవనాన్నిప్రతిబింబిస్తూ గొల్లయాసలో సరళంగా సాగిన అరమరికలు లేని సంభాషణలూ, వాళ్ళ ఆలోచనలకూ స్వభావాలకూ అనుగుణమైన వర్ణనలూ కథకు చక్కని 'అనుదాత్తత'ను సంతరించి పెట్టాయి. ఉదయాన్ని పరికిస్తున్నశ్రీలక్ష్మమ్మకు 'తూరుపు మేకపాలు ఒలకబోసినట్టు'గా తోస్తుంది. తనను ఒంటరిని చేసి తమ్ముడూ, మరదలూ పట్నానికి వెళ్ళిపోతుంటే బస్సు కదలే వరకు ఉండిపోతుంది. 'ఎప్పుడు కట్టుతెంచుకుందో మేకపిల్ల, దాన్ని అపురూపంగా గుండెకు హత్తుకుంది. ఇకమీద ఇదే కదా తనకి తోడు!'. ఈ ఆఖరి వాక్యాలు కథకు చక్కని ముగింపు. 'అతడు-నేను' మూడవ సంకలనం లోని మొదటి కథ. వేపచెట్టు చిరుచేదు సుగంధం, నీలి ఆకాశంలో రూపులు మార్చుకుంటూ హటాత్తుగా మాయమైన మబ్బుతునక, సగంతెరచిన కిటికీలో రెపరెపమంటున్న'ఇండియా ఇన్ స్లో మోషన్'పుస్తకం--ఆమె జీవన నేపథ్యానికి సరిపడే వర్ణన. అతడు పెరాలిసిస్ స్ట్రోక్ తో మంచాన పడిన ముక్కోపి. అతడు ఏనాడూ తనను ప్రేమించలేదని తెలిసీ,పిల్లలు కలుగ లేదన్న నెపంతో మరోదాన్ని కట్టుకొని విడిపోయిన అతన్ని నిర్లిప్తంగా నైతేనేమి అటవీ జన సంప్రదాయాన్ని, భార్యా ధర్మాన్ని ఆమె నిర్వర్తిస్తూ సర్వసపర్యలు చేస్తుంటుంది. అతని వైద్యానికి ఉన్న ఇల్లును అమ్మి సేవాశ్రమాన్నిఆశ్రయిస్తుంది. తనను తిట్టిపోసే అతని తల్లికి చచ్చే వరకు సేవ చేస్తుంది.'అవును,అతను నీకు ఏం చేశాడని నువ్వింతగా సేవలు చేస్తున్నావు'అన్న షరీఫా కు జవాబుగా ఆమె 'మనం జీవించడానికి ముఖ్యమైన లక్షణం జీవితం మీద ప్రేమ. ఇతరులను జీవింప జేయడానికి కావలసినది నమ్మకం, జాలి, దయ, ప్రేమ. ప్రపంచాన్నీ, మనుషుల్నీ నమ్మలేని ప్రేమించలేని స్థితి విషాదమైంది' అంటుంది. సందేశాత్మకంగా ముగిస్తుంది కథ. ఇలాంటి అపురూపమైన కథా తోరణాలు 'కె.వరలక్ష్మి కథలు'. రైల్వే స్టేషన్లో అడుక్కుతినే బాలిగాడికి దొరికిన తప్పిపోయిన పాప జాలికథ 'పాప'. పడుపు వృత్తి లోని పసిడి బొమ్మల సున్నిత కథాంశం 'పిండి బొమ్మలు'. భూమి గల్లంతు కథ 'దగా'. మూఢ ఆచారాలు, నిస్సహాయ స్త్రీలు -మనసును పిండేసే ఉదంతం 'సుహాసినీ పూజ'. నన్ను ఆకట్టుకున్న అద్భుతమైన కథలు 'గాజు పళ్ళెం','మంత్రసాని', 'ఖాళీ సంచులు', 'ప్రత్యామ్నాయం','ప్రస్తానం', 'ప్రయాణం', 'నిరసన', 'ప్రత్యామ్నాయాలు' మచ్చుకు కొన్ని.'గాజు పళ్ళెం'-కూలీల దుర్భర బ్రతుకుల అద్భుత చిత్రీకరణ. ప్రతీతాత్మకమైన శీర్షిక. ఇతివృత్తానికి అమరిన రచనాత్మక కళా సృజన అద్వితీయం. కథాంతంలో 'అద్భుతాంశాన్ని' అత్యంత దయనీయంగా ఆవిష్కరించిన తీరు అమోఘం! గత్యంతరంలేక తన ఆకలినీ తనకడుపు లోని బిడ్డ ఆకలినీ తీర్చగల అంతిమ నిస్సహాయతకు లొంగిన గంగ 'వెన్నులో ఘటిల్లుమని ఏదో చిట్లినట్టయింది.పదిలంగా గుండెకు హత్తుకున్న గాజు పళ్ళెం విరిగి వెయ్యి ముక్కలయింది'. మనసును ముక్కలు చేసే ముగింపు. గాజు పళ్ళెం ఒక గొప్ప కథ. కె.వరలక్ష్మి గారి కథా సంపుటి 'క్షత గాత్ర'(2014), కవితా సంపుటి 'ఆమె'(2005), నాలుగు నవలికలు, రేడియో నాటికలు, వ్యాసాలు నేనింకా చదువవలసిన వారి రచనలు.వారు పొందిన అవార్డులు: చాసో స్పూర్తి, రంగవల్లి, విమలా శాంతి, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా, తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి, రంజని, పులికంటి,ఆర్.ఎస్.కృష్ణమూర్తి, అజో- విభో, ఆటా, తానా, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి మొదలగు అవార్డులు. 2013 సుశీల-నారాయణరెడ్డి ఉత్తమ రచయిత్రి పురస్కారం వరలక్ష్మి గారిని వరించడం అభినందనీయం. 'ఆమె కథలలోని పరిసర పరిశీలనలను చూస్తుంటే ప్రాచీన కవులలో శ్రీకృష్ణదేవరాయలు, ఆధునికుల్లో విశ్వనాథ సత్యనారాయణ గుర్తుకొస్తారు' అన్న చేరా గారి అభినందన అర్హమైన అమూల్యమైన కితాబు. వరలక్ష్మి గారు ముందు ముందు మరింత ఉత్తమ సాహిత్యాన్ని అందించ గలరని ఆశిద్దాం. -నాగరాజు రామస్వామి. (కె.వరలక్ష్మి గారు జనవరి 17,2014 న ప్రతిష్టాత్మక "సుశీలా నారాయణరెడ్డి సాహితీ పురస్కారం అందుకున్న సందర్భంగా-)
by Ramaswamy Nagaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MyncTc
Posted by Katta
by Ramaswamy Nagaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MyncTc
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి