పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, ఫిబ్రవరి 2014, శనివారం

Challa Ssj Ram Phani కవిత

మరణించిన మాట స్మృతిలో... మాటలు కత్తులుగా మలచి కుత్తుకలు తరగడానికి కడుపులో ఎవడెన్ని శబ్దాలు దాచుకున్నాడో! ఎవడెన్ని శబ్దాలను మాటలుగా సైతం మలచలేక కడుపులోనే దాచుకుని నిలువెత్తు కన్నీటి బొట్టయ్యాడో! * * * కాలచక్రంలో కాళ్ళ కింద చీమల్లా నలిగిపోయి నేల రాలి రోడ్డు ప్రమాదాల్లో ఆవిరైపోయిన కోట్లాది బిలియన్ల మాటల ఆత్మశాంతి కోసమే నేనిది రాస్తున్నాను! మనిషితనం మలిగిపోయి హృదయం మాయమైన మాట మన చుట్టూ దయ్యమై తిరుగుతుంటుంది! ఏ కిరీటాలు, ఆర్భాటాలు లేని మాటల నగ్నత్వం నన్ను మరణంలా ఓదారుస్తుంది! మాటలకు ఆత్మను తొడిగే వ్యర్ధ యత్నంలో మైకు ఖద్దరు టోపీ తొడుక్కుని కూడలిలో కురిపించే వాగ్దానాల మూటలే తార్రోడ్డులోంచి తన్నుకొచ్చిన కంకర్రాళ్ళు! ఇరానీ హోటల్లో మాటలు చాయ్ లో మలాయ్ లా తేలుతూ చెరువులో జలకాలాడే పశువు మీద పరచుకున్న నాచులా నానుతుంటాయి! పాన్ షాపు చెట్టుకి పూసే మాటలు - నోటి డ్రైనేజీలో ఎర్ర బురద అవుతాయి! భజంత్రీవాడి అంగడిలో మాటలు కత్తెర్ల అరుపులలో సెన్సారైపోయి ఏడుకొండలవాడి ఖాతాకు ఎగుమతి అయ్యే తలనీలాలవుతాయి! ఆత్మకు అంటని మాట హృదయాన్నైనా చేరలేక జేబులోంచే జారిపోయి అకాలంలో రోడ్డెక్కి లారీ కింద పడ్డ పిచ్చి కుక్క మెదడులా చితికి నజ్జు నజ్జవుతుంది! ఆత్మ లేని మాట ఆశలు మోసులెత్తకుండా బతుకు గాడిపొయ్యిలో అడుగంటిపోయిన బాల్యం! పసిగుడ్డుకు పాలిచ్చే వేళ రొమ్ము దాచుకోవడానికి జానెడు గుడ్డ చేతికందక కలవరపడే తల్లి! సిగ్గు దాచుకోవడానికి చీరముక్కైనా దక్కని దేశంలో పుట్టిన చెల్లి! ఆత్మీయతల రక్షణ కవచంలా ఆత్మను హత్తుకోలేని మాటలకు శ్రాద్ధంపెట్టి తిలోదకాలొదిలి ఎలిజీ రాసేశాను! ఏడవకండి! మాట మరణిస్తే కన్నీళ్ళు పెట్టకూడని మాటల అక్షయపాత్రలం మనం! మాటలు నిధుల్లా దాచుకున్న నడిచే సముద్రాలం మనం! ఆప్యాయతల దేహంతో అనురాగాల ఉడుపులు తొడుక్కుని ఆత్మతేజంతో బూడిదలోంచి ఫినిక్స్ లా మళ్ళీ పుడుతుంది మాట! సృష్టిలోని నగ్నత్వాన్ని తొడుక్కుని పసిపాప బోసినవ్వులా మళ్ళి పుడుతుంది మాట! అప్పుడు మానవత్వపు హరివిల్లు మనసు నింగిలో స్వయంభువు!

by Challa Ssj Ram Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bbsrnz

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి