పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, సెప్టెంబర్ 2012, శనివారం

అఫ్సర్ ||An Empty Episode-5 :రెండు అరచేతులూ వొక వరదగుడి ||


అయిదో సన్నివేశం: ఏదో వొక వాన ఎక్కడిదో వొక వాన ఎప్పటిదో వొక వాన ఎందుకో వొకందుకు కురవనీ, నువ్వొక చిన్ని ఆకువై, తడి నేలవై, తేమ గాలివై మిగిలేలా! సందర్భాలు ఎప్పుడూ రావు. సన్నివేశాలు ఎప్పుడూ కురవ్వు. నువ్వే వొక సందర్భమైపో..నువ్వే వొక సన్నివేశమై కురిసిపో. దుఃఖపు ఆఖరి అంకంలో నువ్వొక నవ్వుని మెరిపించి వెళ్లిపో.

1

నా ఎడమ చెయ్యి నీ కుడి చేతిలోకో
నీ కుడి చెయ్యి నా ఎడమ చేతిలోకో ప్రవహిస్తున్నప్పుడు
ఆ రెండుచేతుల వొకే స్పర్శ మీద
నాలుగు వాన చినుకులూ వొక నీరెండా సంగమిస్తాయి.

వాటి అరచేతుల మీద వొక వరద గుడి
వాటి వేలి కొసల మీద సీతాకోకల అలసట లేని సంచారం.

ఆ ఏడు రంగులూ అలానే వుండనీ కలిసీ కలవక.
ఆ నాలుగు చినుకులూ ఆ నీరెండా అలానే వుండనీ కరిగీ కరగక.

2

నిజానికి ఎవరు ఎవరిలోకీ కరిగిపోం
ఎవరిలోపల వాళ్ళే వుండిపోతాం
వొక్కటయ్యే కలని శాశ్వతంగా మోస్తూ.

అనేకాటల పాటల సంభాషణల కలివిడి రాగంలో
నువ్వు నువ్వే, నేను నేనే.
నువ్వు నాలోకీ, నేను నీలోకీ ప్రవహిస్తున్నప్పుడు కూడా
నేను నేనే, నువ్వు నువ్వే.

నేను నీలోకీ, నువ్వు నాలోకీ వొరిగిపోనీ,
ఆ రెండీటినీ చెరపకుండానే
మనిద్దరి నీడలూ చెరగకుండానే.

3

దుఃఖాన్ని ఎటూ దిగమింగుకోలేనప్పుడు చుక్కలా రాలిపడుతుంది వాన. ఇక ఆ తరవాత నీలోపలి ఎడారిని పీల్చి తనలోపలికి ఇంకించుకుంటుంది ఆ వాన చుక్క. మన రెండు అరచేతులు గట్టిగా వొక దాన్ని ఇంకోటి అదుముకుంటాయి కచ్చితంగా రెండు శరీరాల్లా- వాటి మధ్య ఇక వొక సముద్రం కూడా ఇరుకయిపోతుంది. గాలి గిరికీలు కొట్టుకుంటూ వెళ్ళి ఆకాశాన్ని కిందికి దిగి రమ్మని సతాయించేస్తుంది. ఆహా...ఇంకేం కావాలి? ఈ సముద్రానికీ, ఆ ఆకాశానికీ మధ్య వొక గీత గీస్తూ రివ్వున దూసుకుపోతాయి పక్షులు కొన్ని, నీరెండ స్నానానికి రెక్కల్ని దువ్వుకుంటూ.

4

ఈ రెండు దేహాల మధ్య వాంఛ లేదని కాదు,
మరీ ఈ వాన
ఏక వానగా పడుతున్నప్పుడు
నీటి దుప్పటి కింద రెండు అలల సంభాషణ అందంగానే వుంటుంది.
ఏ ఆచ్ఛాదనలూ లేని నగ్న భాష వినాలనే వుంటుంది.

5

కానీ
అంతకు మించి ఇంకేదో ఇద్దరి మధ్యా!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి