పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, సెప్టెంబర్ 2012, శనివారం

కెక్యూబ్ వర్మ ॥వాడు॥


వాడు నవ్వడు
జనం నవ్వును హరిస్తాడు...

వాడు ఏడ్వడు
జనమందరి ఏడుపును మీసం కప్పిన పెదవెనకాల చప్పరిస్తాడు...

వాడు కదలబారే ఓ వానపాములా కనిపించే అనకొండ....

వాడి గాజు కళ్ళ చాటున
ఓ మహా విస్ఫోటనం దాగుంది...

వాడు కోట్లాది ప్రజల
ఆకలి మంటల మూలవిరాట్టు....

వాడికొక్కటే కోరిక
ఈ గొంతులన్నిటిపై డేగ కాళ్ళను గుచ్చాలని....

వాడికొకటే ధ్యాస
ఇక్కడి అమ్మ పాలను సంతలో అమ్మేయాలని....

వాడికి వున్నదొకటే లేపన శక్తి
పడిపోయిన మార్కెట్ మాయా రేఖల పురోగమనం....

వాడి మొఖాన అంటిన బొగ్గు మసిని
అందరి జీవితాలపై మండించి ఆనందించే కౄర రక్కసి వాడు...

వాడొక నిశ్శభ్ద డ్రాక్యులా
జనం మూలుగులను నొప్పి తెలీకుండా పీల్చేసే జలగ సిరంజీవాడు....

వాడు అమ్మ గర్భంలో దాగిన పిండాన్ని
నోట కరచుకు పోయే తోడేళ్ళ గుంపు నాయకుడు

వాడు రణస్థలం నుండి కూడంకుళం దాకా అణు విస్ఫోటణం
చేయ చూస్తున్న రాకాసి డేగ ముక్కున వేలాడే శవం....

వాడొక ప్రేతాత్మ
వాడి అంత్యక్రియలనాడే ఈ దేశానికి కళ్యాణం....
(తే19-09-2012)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి