పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, సెప్టెంబర్ 2012, శనివారం

కాంటేకార్ శ్రీకాంత్ // ఇప్పుడు //

ఇప్పుడు
కన్నీళ్లలో ఉప్పదనం తగ్గిపోయింది
ప్రేమలో చిక్కదనం తగ్గిపోయింది
బంధాలలో గట్టిదనం తగ్గిపోయింది
వ్యవస్థలో గొప్పదనం తగ్గిపోయింది
చివరాఖరుకు.. మానవత్వానికి విలువ తగ్గిపోయింది

అందుకే ఈ ఇప్పుడు నాకు అనవసరం
అసంగతి, నచ్చని వ్యవహారం

olden days are golden days
అవును, పాత రోజులు, పాత మనుషులు,
పాత కాలం.. అవే ఆ పాత మధురాలు
గడిచిన స్మృతి అంతా గొప్పదిగా నిలిచిపోతుంది
ఆ రోజుల్లో అని చెప్పుకుంటే
గొప్ప భావాలు పొంగుకొస్తున్నాయి
నడుస్తున్న కాలం తన విలువను కోల్పోయి
నిస్సారంగా మారుతోంది
ఈ రోజుల గురించి మాట్లాడటానికి మనసొప్పడం లేదు
మాటలూ రావడం లేదు

ఎందుకు,
తోటి మనిషిని చూసి
ఆత్మీయంగా పలకరించి
కొన్ని ఊసులాడేందుకు నీకు సమయం లేదు
కాంక్రీట్ జంగల్లో.. మహా విశాలమైన అపార్ట్ మెంట్లలో
నీదొక ఇరుకు బతుకు
ఇరుగుపొరుగు సంబంధం లేని బతుకు
పక్క ఇంటి కష్టనష్టాలు, సుఖదుఃఖాలు
నీ చెవికి సొకవు.. నీకు ఆసక్తి రేపవు
నీ పొరుగువారితో ముఖ పరిచయమూ ఉండదు
ఈ జనారణ్యంలో తెలిసిన ముఖాలే కనిపించవు
సాయం చేయాలన్నా తలంపూ రాదు
వచ్చినా అందరూ పరాయివాళ్లే..
నీకు చేతులు రాని పరిస్థితి
నువ్వు నాకు ఎంత దూరమో..నేను నీకు అంతేదూరం
కనుక నీకు-నాకు ఎప్పుడు పొత్తే కుదరదు
మాట కలవదు.. ముచ్చటకు సమయం దొరకదు
పక్కపక్కనే ఉన్నా రైలు పట్టాలలాగా ఎప్పుడూ కలవకుండా
జీవన ప్రవాహంలో కొట్టుకుపోతాం
ఎంత విచిత్రం, నిత్యం కిటకిటలాడుతూ
కాలు పెట్టడానికి సందు దొరికని మహా నగరంలో
మనుషుల మధ్య ఎంతో దూరం

ఇక ప్రస్తుత విలువలు, మానవతా దృక్పథం, రాజకీయాల గురించి
తక్కువే మాట్లాడుకోవాలి మిత్రమా
బురదలో రాయి వేయడం వల్ల మనకూ అడుసు అంటకపోదు
ఈ వ్యవస్థతో రాసుకుపూసుకు తిరుగుతున్నవారమే కదా
ప్రస్తుతం ప్రబలుతున్న అనాగరిక, ఆధునిక బతుకులో
మనకు లేశమాత్రమైనా పాత్ర ఉంది కదా
కనుక ఈ ఇప్పుడు గురించి నేనేమీ చెప్పలేను
నిన్నమొన్నటి.. ఆ పాత రోజుల గురించి అడుగు
నా కవిత్వం, నా భావాలు వెల్లువెత్తుతాయి.. కీర్తిస్తాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి