1
మాటల పెట్టుబడితో కట్టిన మైత్రీకోటలన్నీ చీమల చిటుక్కుకే కుప్పకూల్తున్నాయి
సునామీ భయంతో స్వర్గం లోనూ క్షణం ఓ యుగం
బీమా ఏజెంటులా స్నేహంపాలసీలకోసం
ఎన్ని గుండె గడపలు ఎక్కి దిగానూ!
ప్రీమియం దండగే గానీ
జీవితకాలం నిలబడుంటుందన్న ధీమా లేదు
నాకో డైరీ లాంటి మిత్రుడు కావాలి
2
కొట్టుకొచ్చిన జాంకాయలో కాకెంగిలి చేసి పెట్టిన కాలీషా కహాఁ హైఁ రే తూ!
నెమ్ము చేస్తుందని తెలిసీ నా కొసం
వానావానా వల్లప్పలయిన శేషూ శ్రీలక్ష్ములిప్పుడు ఎక్కడున్నారో!
నా నిద్ర తాను కాసి తెల్లార్లూ బుల్లి స్లిప్పులు రాసిచ్చిన జాను పీనుగ్గాడు
దొంగ లెక్కన నా కోసం గోడలెగబాకి చావు దెబ్బలు తిన్న సుబ్బారాయుడు
ఏ ఏట్లో చచ్చార్రా మీరంతా ఇప్పుడూ!
3
నీతులు సూక్తులు నియమాలు నిబంధనలు
మంచితనం మర్యాదా మంటిగడ్డలు …బాబోయ్
బతుకు ఫుల్లుగా గాలి కొట్టిన కాలిబంతయిపోయిందిరా తండ్రీ!
సేఫ్టీ వాల్వులా సీమన్నారాయణా
మళ్ళా నువ్వొచ్హి కాస్త గాలి తీస్తేగాని
ఊపిరాడేటట్టు లేదురా!
4
అమ్మ నిచ్చావ్ నాన్న నిచ్చావ్ అన్నదమ్ములు అక్కచెల్లెళ్లందర్నిఇచ్చావ్
అడక్కుండానే అన్నీ అమర్చే పెట్టే అతిమంచి ఆలినీ,
కడిగి ఆరబోసిన ముత్యాల్లాంటి పిడుగుల్నీ అచ్చంగాఇచ్చావ్..థేంక్స్!
అడుగులకు మడుగులొత్తే వందిమాగధుల్ని సరే
అస్తమానం పీక్కుతినే యములాడినీ దయచేసావ్
అన్నీ ఇచ్చి ఒక్క మా కేడీ దుర్గాగాడిలాంటి మంచి మిత్రుణ్ని
ఇవ్వడం మాత్రం మర్చిపొయావా!
నువ్వు దేవుడివా …మా చెండామార్కు చెన్నకేశవ సారు మాష్టారువా!
కన్నీరు లేక పోతే మానె
కాసింత నెత్తిమీది కడవబరువును మోసే మా మోసెస్ చేతులు మళ్లా కావాలి
చక్కిలిగింతలు దొంగలెత్తుకు పోనీ
చుక్కల్లో చక్కర్లు కొట్టేవేళ
పడకుండా పట్టుకునే మా పిచ్చయ్య పక్క భరోసా కావాలి
నాగేశం గాడిలాగా 'నాకేంటీ' అనాలోచించకుండా నవ్వులు వెదజల్లి పెట్టేవాణ్ని
దుర్గాగాడిలా సునామీనైనా ధైర్యంగా ఢీకొట్టే మొనగాణ్ని
ఒక్క మిత్రుణ్ని
బదులుగా ప్రసాదిస్తావా దయచేసి...నీ వరాలన్నీ నీకు తిరిగిచ్చేస్తా
వచ్చే జన్మంటూ..అహ.. ఉంటే…గింటే
మా మనోహరుగాడిలాగా పుట్టి నీ మైత్రీరుణం తీర్చుకుంటా!
గాడ్ ప్రామిస్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి