1
రోమియోకి రోడ్ మ్యాపు లేదు
జ్యూలియట్ హృదయాన్ని చేరడానికి
కొట్టినపిండనుకున్న పారూ మనసుకి
దారెటో తెలీక దేవదాసు తడబడ్డాడు
ప్రేమయనగా రొండు హృదయములు ఒకే పన్ థాన నడుచుట
ము.వెం.ర కథలో హిందీ చిత్ర దుబాసీ అనువాదం
ఆ పన్ థా ఏమిటొ అంతుబట్టకే కదా ఇంత కథా!
2
ఈ రాణీ ప్రేమ పురాణం ఇది కాదోయ్ చరిత్ర సారం
ఓకేనండీ మహాకవి శ్రీ శ్రీ గారూ
మరి క్లియోపాట్రా కొటేరుముక్కు నెక్కడ పాతేస్తారూ!
సమాధికైనా బెదరని అమరప్రేమ కదరా అనార్కలిది
సమాసాలు తింటూ తాగే మొగలయీ చాయా అది!
తాజ్ మహల్ తాజాదనం రహస్యమంతా
ముంతాజ్ మేలిముసుగు అనురాగంలోనే ఉంది
భాగ్యమో అభాగ్యమో
భాగమతీమోహంలో పడి మతంటూ పోయాక
కులీ బాదుషా కానీ కూలీ పుల్లయ్యే కానీ
అందరిదీ ఒకే మాదిరి హమ్ దర్ద్ లేరా జానీ
జయదేవుడి వనమాలి జానకి స్వయంవర మాలిక
కలువుల కొలువులు, కడలుల అలజడులు
సమయం దొరికిన కవులల్లిన సుందర కవిసమయాలు
౩
ఆరు పదులు ఈదిన అనుభవంతో చెబుతున్నా
వలపంటే వడ్డూ లోతూ తెలియని ఓ గడ్డు అగాథంరా తండ్రీ!
యథాతథానికి అదొక ఆతిశయాలంకారం
పరమపథ సోపానపటంలో పాము పక్క నిచ్చెన మీదారోహణం
అందితే చింత
అందనంత కాలమే గుప్పెట్లో వింత
బైటపడే దారి లేని పద్మవ్యూహంరా అభిమన్యూ
మయసభామధ్యంలో అభిమాన సుయోధనుని
అయోమయం అంతకన్న సుఖం
దేహాత్మల మొత్తాన్ని
ఒక సందేహాల డోలికగా మార్చే మంత్రగత్తె కదారా కాదల్!
ఆదిలోనే పడిందా హంసపాదు
అదృష్టవంతుడివి
హింస తప్పిందని వెంకయ్యకు ఓ టెంకాయ కొట్టూరుకో!
4
ఇంత చెప్పినా
కాదు..పిల్ల గాలి తగిలిందంటావా
హతోస్మి…
గాండ్రించే పులివి
ఇహ తలపుల తలుపుల దగ్గరే తచ్చాడే కాలుగాలిన పిల్లివి
పాస్ వర్డ్ మర్చిన సాఫ్ట్ వేర్ ఎనలిస్టువి
ఏక్సెస్ డినైడ్-విండో కనపడ్డా సాండోలానే ఉండాలి మరి!
సిస్టం క్రాషయినా నో ప్రాబ్లం అనుకుంటే ఓకే ..నీ ఇష్టం
'లౌ'ప్రోగ్రామ్ లోకి లాగిన్ ఐపో మరి
నీ ఆఠీన్ రాణీని ఎలౌ చేసేయి..hurry
కాఠిన్యమో..కారుణ్యమో రన్ చేస్తేనే గదా ఫేట్ తెలిసేది!
ఆఖరుగా ఒక మాట
అపరిచితం టు సుపరిచితం రూటు పూలదారి కాదు
రోదసీ వ్యోమగామి కొత్త గ్రహం కక్ష్య కుదుపు అదుపు
ఇంతకన్నా కొన్ని కోట్లలక్షల రెట్లు సులువు
కిక్ కోసమే ఈ బొకే ఎఫైర్ అంటావా
థింక్ ట్వైస్..బిఫోర్ యు సింక్ ఇన్ ది లవ్ బకెట్ !
గుడ్ లక్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి