మొదటి సన్నివేశం:
అనుభవాల్ని తప్ప తేదీల్ని నేనెప్పుడూ చూడను. కానీ, ఆ తేదీలే ఇప్పుడు గుండెకి వేలాడుతూ కనిపించడం చూస్తున్నా. ఆగస్టు నాలుగు -- ఇంకా తెల్లారని రాత్రికి నిద్రపట్టనప్పుడు-- గది కిటికీలోంచి బయటి ముసురుని నాలోపలికి చూస్తూ.
1
నిండా చీకటి రాల్తున్నప్పుడు అసలే దీపకాంతి నా కళ్లకి శాంతినివ్వనప్పుడు ఏం చెయ్యమంటావ్?! చూరు పట్టుకు వేలాడుతున్న బయటి వెన్నెల నా గోడ మీద చెట్ల నీడల్ని గీస్తూ వెళ్లిపోతుంది. నాకు తెలుసు, పక్క మీద నా వొళ్ళు భారమయి పోతుంది. నేనొక పక్కకి వొరిగి నీడల్లోకి చూస్తూ ఆ నీడల వెంబడి నా చేతి వేళ్ళని కదిలిస్తూ వొక శూన్యాన్ని రాస్తున్నానా?పరుగులు ఆపని వొక నీ వూహలోకి ప్రవహిస్తున్నానా?నువ్వెప్పుడూ ఇక్కడే లేవని తెలుసు, నువ్వు నీ ప్రపంచంలోనే నీలోనే ఇరుకిరుగ్గా తిరుగుతూ నీ తీరిక లేని వొత్తిళ్ల లోకంలోనే వున్నావనీ తెలుసు. అయితే కానీలే కానీ, ఈ లోపలి లోకంలో ఎవరు ఎవరిని వింటారని?ఎవరి నీడలకి వాళ్ళే తల బాదుకోవడం తప్ప!
2
తాడో పేడో తేల్చుకోలేను కానీ, నీ ఊహ వొక సర్ప మాయ. వూహ మాటకేం, చాలా సార్లు నిజమూ అంతే కదా అనిపించదా?లెక్కపెడ్తున్నానని కాదు గానీ, ఎన్ని అడుగులు నీతో నడిచి వచ్చానో వెనక్కి తిరిగి చూసినప్పుడు, అవన్నీ నువ్వు చెరిపేస్తూ వచ్చావని ఇప్పుడీ క్షణం అనుకోనా? నిజం కూడా నీలాంటిదే...నీ వూహలాంటిదే...వూహకందదు ఎంతకీ!నిజానికి అసలే అందదు.
3
ముసురు పట్టిన తెల్లారుజాము అంత తేలిగ్గా కరగదు. రాత్రి పాదాలు మరీ ఇనపవి. ఎప్పటివో ఆ పాత గుడి రథ చక్రాలు కదలవు వొక పట్టాన. వొక్క చినుకో, వొక ఉప్పెనో అయితే బాగుండేమో కానీ, ముసురు కదా ఇది! చీకటీ రాత్రీ ముసురూ నా అనిద్రలో అల్లరల్లరిగా ఆడుకుంటూనే వుంటాయి తెల్లారనివ్వకుండా.
4
“కలలో కూడా నిన్ను కలవనా?” లోపలి చలి వొక కత్తివేటు, అట్లా అని గాయమేదీ కనిపించదు!
5
“ఏమో!”
అని నీవే అనిపించే ఈదురుగాలి వొకటి నీ/నా నీడల మీంచి పెంకిగా ఎగిరిపోయింది, చెరి సగంగా మనం దాచుకున్న వూహల గుంపుని చెదరగొట్టి, ఆకాశానికి అడ్డంగా పరిగెట్టింది.
6
ఎక్కడికని పరిగెత్తను?! ఎందాకని పరిగెత్తను?
*07-08-2012

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి