1.
కవీ, నీ పాత్రలో కొద్దిపాటి నీరు చేరగానే
దానినే గలగలలాడించి అది ఒక సెలయేరని భ్రమింపచెయ్యకు
నీ ముందు, నదుల్ని తాగి ఏమీ ఎరగనట్లు చూస్తున్నవారుంటారు
2.
ఎడారిలో బావి తవ్వాలని చూడకు,
ఎంతదూరమైనా ప్రయాణించి,
ఎన్ని పగళ్ళు, రాత్రులకైనా తలవొంచి ఒక నదిని కనుక్కో ముందు
ఎడారి ఏది, నది ఏది అని అడగకు
నీ అడుగులు అక్కడ మొదలుపెట్టు
3.
నీ దగ్గర ఉన్న శబ్దాలు కొన్ని
కాగితంపై పేర్చటమే కవిత్వం అనుకొన్నంతకాలం
నువ్వు ఒక్క కవితైనా చెప్పలేవు
నీ దగ్గర ఉన్న నిశ్శబ్దంలో కొంత
శబ్దాలలోకి అనువదించడమే కవిత్వం
ఎపుడైనా గమనించావా
నీలో నువు మాత్రమే వినగల నిశ్శబ్దాన్ని,
నువు మాత్రమే ప్రవేశించగల నీ నిజ ప్రపంచాన్ని
4.
నీ అక్షరం ఇంకా కాగితంపై ఆకారం దాల్చకముందే
నీ చెవిలో చప్పట్లు హోరు వినబడుతుంటే,
నిజం చెబుతున్నాను నమ్ము,
నువు ఎప్పటికీ కవిత్వం రాయలేవు
ఏ స్త్రీనీ ప్రేమించలేవు, ఎప్పటికీ నీకు జీవితమైనా మొదలు కాదు
5.
ఒక పువ్వు, ఒక పిట్టకూత, ఒక దు:ఖాశ్రువు
ఒక వానచినుకు, ఒక పసినవ్వు
ఏదైనా ఒకే ఒకటి, నీ జీవితాన్ని తలకిందులు చేయకపోతే
వాటిలోకి నువు నదిలోకి దూకినట్టు దూకలేకపోతే
వేలకొద్దీ పూలూ, అశ్రువులూ ఏవీ నిన్ను కదిలించలేవు
ఇపుడు గుట్టువిప్పుతున్నాను
ఒక పువ్వు నది, వేల పువ్వులు ఎడారి
6.
కవిత్వాన్ని వెలిగించే అగ్నికోసం, బయట వెదికేవాడికి
పొగమంచులో తడుస్తున్న ప్రపంచం మినహా ఏమీ కనిపించదు
నిన్ను నీకు కనబడనీయని పొగమంచులోకి
నిర్భయంగా చేతులు చాచినపుడు నీవే అగ్నివని గుర్తిస్తావు
చూస్తున్నావా
ప్రపంచమంతా అగ్నిమయమై గోచరిస్తుంది
నీ అక్షరాలు వెలుగుతున్నాయి
7.
కఠినమైన రహస్యాలు కొన్నిటిని దయ బయటపెట్టినపుడు
సముద్రమంత హోరు అకస్మాత్తుగా ప్రజల్ని కౌగలించుకొంటుంది
అప్పుడా రహస్యాలను
భవిష్యత్ స్వప్నాలను నిర్మించే ఉత్సాహవంతులు మాత్రమే వినగలుగుతారు
రహస్యాలను రహస్యంగా తెలుసుకొని, వారు
సూర్యకాంతిని వెలిగిస్తున్న చీకటిలోకీ
చీకటిని వెలిగిస్తున్న కంటికందని కాంతిలోకీ
అందరితో మాట్లాడుతూనే వడివడిగా నడుస్తారు
8.
వేలకొద్దీ నేనులు మాయమై,
ఒక నేనే వేల ప్రతిబింబాలయిందని కనుగొన్నపుడు
కవికి తన కవిత్వం రాయటం పూర్తవుతుంది
9.
కవిత్వాలకేం గానీ,
హాయిగా నవ్వుకొందాం కాసేపు
మనం చేయలేని చాలా పనులు
మన నవ్వులో దాగొన్న దేవతలు చేస్తారు
(ఇస్మాయిల్‌గారూ, ఎందుకో మీరు గుర్తొస్తున్నారు..)
7 అగష్టు 2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి