పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, ఆగస్టు 2012, బుధవారం

రెడ్డిరామకృష్ణ || సముద్రంతొ ఆటలాడే కుర్రాడు ||

సముద్రంతొ ఆటలాడే కుర్రాడిని చూసాను
నిన్న చింతపల్లిలో


సిం హం జూలు పట్టి
దాని పై స్వారీ చేయాలని చూస్తున్నాడు
దెబ్బతిన్న పాములా సర్రున లేచిన కెరటం
బుసకొడుతూ పడగ విప్పితే
దాని పీక పట్టి కోరలు పీకిన వానిలా
నిర్భయంగా దాని చుట్టే తిరుగు తున్నాడు

పన్నెండేళ్ళ బాల్యమే అయినా
గుండెల క్రింద "కట్ట" పెట్టుకొని
సముద్రాన్ని జయించాలని చూస్తున్నాడు

ఒంటి పై చొక్కా కూడా లేని వాడు
బెల్లం దిమ్మకు పట్టిన నల్లని కండచీమలా
సముద్రాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు
ఎన్ని సార్లు విదిలించినా మళ్ళీ మళ్ళీ వచ్చే చీమలా
కెరటం ఎన్ని మార్లు బయటకు నెట్టేస్తున్నా
సముద్రం పైకి దూకుతునే ఉన్నాడు

ఎంత సాహసం వాడిది
సహస వంతులే దేన్నయినా సాధించగలరని
నిరూపించే వాడిలా ఉన్నాడు
రేపటి బతుకు సముద్రాన్ని ఈదటానికి
తనకు తనే తర్ఫీదు పొందుతూ
మరొ ఏకలవ్యునిలా కనిపిస్తున్నాడు

ఈసారి బొటన వేలు కావాలనే దొరలు వస్తే
తెడ్డు తిప్పగల చైతన్యాన్ని స్వాసిస్తున్నట్టుగా ఉన్నాడు.
*07-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి