పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, ఆగస్టు 2012, బుధవారం

హెచ్హార్కే॥ స్థలానికి సలాం॥

దూరం నుంచి, చాల దూరం నుంచి చూస్తున్నాను
సిల్కు ఉదయాలను, వెండి సాయంత్రాలను, ఇంకా
కూలక మిగిలిన మెత్తని నీడల ఆకుపచ్చ మధ్యాన్నాలను,

మత్తుగా మత్తుగా మంద్ర మంద్రంగా వెలిగే రాత్రులను,
ఫోన్ చేయకుండా వెళ్లినా ఎదురొచ్చి కావిలించుకునే,
బాధను పంచుకునే ఊరిని

పరాయి పగటిలో నా రాత్రి, పరాయి రాత్రిలో నా పగలు
నా గడియారం దూరాన్ని కొలుస్తోంది, క్షణ క్షణాలుగా
నా ఆకాశం నేలను పిలుస్తోంది, అటు వైపు దాన్ని

ఎక్కడైనా ఉంటుంది చీకటి పెట్టుబడిగా వాణిజ్య రాజకీయం
ఎక్కడైనా ఉంటాయి మెత్తని నాల్కల వెనుక విషం కోరలు
పుట్టలను ముట్టడించి సవాలు చేస్తుంటుందొక సౌందర్యం

ఎంత అందం నా ఊరు
దాని అందం నా ప్రాణం

ఎప్పుడో ఎవరో ఏవో కట్టించినందుకు కాదు, వాటి
పునాదుల్లో బడుగు బతుకులను పూడ్చినందుక్కాదు
కత్తుల పహరాలలో కొన్ని పాటలు పండినందుకు కాదు
ఉలుల కింద శరీరాలు రాలి తయారైన శిల్పాల కోసం కాదు
అందుకోసం కూలగొట్టినవి, పూడ్చి పెట్టినవి, రాలగొట్టినవి
కూలిపోగా, పూడిపోగా, రాలిపోగా‍ మిగిలిన కొండలు, చెట్ల
నీడలు, పువ్వుల వంటి నీడల్లో తారాడే ఊపిరులు చాలు, ఇంకా
మిగిలిన ఒకట్రెండు చోట్ల తేనీటి చెమట మాటల తేటదనం చాలు

రగులుతూ ఉంటుంది, నన్నొక జ్వాలగా‍ బతికించుకుంటుంది
కుంపటి అట్టడుగున దాగిన నిప్పు కణిక... నా హైదరాబాదు

* 6-8-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి