పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, ఆగస్టు 2012, బుధవారం

అవ్వారి నాగరాజు || చరిత్రలు ||

ఈ రోజు నేనొక గాథను విన్నాను

తొణకిసలాడే ఒక స్త్రీ ఒక్కో పూసను కూర్చుతూ

మూడూ తరాల మనుషులు
స్త్రీలు పురుషులు పిల్లల పిల్లలను అల్లడం విన్నాను

మాటల నడుమ
గడచిన కాలపు దుఃఖపు మూలల వెంట
ఆయత్తమై లయాన్విత అశ్ర్రు ఖేద ధూళిగా రాలి కలిసాను

తెలియని ఆగ్రహపు కొనల కొక్కేనికి
శిడి వేలాడి ఉన్మాదపు శాంతినై నన్ను నేను గాయ పరుచుకున్నాను

ఉద్వేగపు ప్రవాహ ఉరవడిలో
రాలిపడిన పువ్వునై రేకులు విరిగి గింగిర్లు కొట్టి
తెలియని దిగంతాల అంచులకు ఈడ్చుక పోయాను

తెలిసిన మాటలు తెలియని కోణాలు
విడి విడి కథనాల నడుమ మనుషులు చీలిపోవడం చూసి
ఒక పరిశోధక విద్యార్థినై నన్ను నేను చూసుకున్నాను

వినడమొక పూరణగ మారి
కాలపు రేఖల అవధులు దాటి అనేక చరిత్రల ఆలవాలమై
ఒక నేను అనేక నేనులుగా
ఆమె నేనుగా నేను ఆమెగా
*07-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి