పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, మే 2014, శనివారం

Nirmalarani Thota కవిత

ఒక్క సారి నవ్వాలని ఉంది ఒక రోజులోనే వసి వాడినా ఓడని వీడని పరిమళాల శ్వాసతో అరవిరిసిన సిరిమల్లిలా స్వచ్ఛంగా భేషజాల ముసుగు తీసి ఒక్క సారి నవ్వాలని ఉంది ! * * * ఒక్క సారి ఏడ్వాలని ఉంది ఒక పూటలో విడివడినా మలయ సమీరపు స్పర్శకు కరిగి కురిసే నీలాల నీరదంలా ఆర్ద్రంగా అస్తిత్వాల ఆనవాళ్ళు చెరిపేసి ఒక్క సారి ఏడ్వాలని ఉంది ! * * * ఒక్క సారి స్నేహించాలని ఉంది అల్లంత దూరాన ఉన్నా అందని ఆకాశపు ఆత్మీయతకై అలుపెరుగక ఎగిసే అలల జవ్వనిలా ఆత్రంగా ఓటములన్నీ ఒడ్డున పెట్టేసి ఒక్క సారి స్నేహించాలని ఉంది ! * * * ఒక్క సారి ప్రేమించాలని ఉంది తన రాకతోనే ఆవిరైపోతానని తెలిసీ ఒక్క ఘడియ తనలో నిండే వర్ణాతిశయపు అనుభూతికై సూరీడి కడగంటి చూపు కోసం వేచి చూసే మంచు బిందువులా తమకంగా కదిలే కాలపు హద్దుల్ని మరిచి ఒక్క సారి ప్రేమించాలని ఉంది ! * * * ఒక్క సారి ముద్దిడాలని ఉంది తాకుతూనే అవని గుండెల్లోకి ఇంకిపోయే స్వాతి చినుకులా వెచ్చగా తీరని తపన అణువణువూ నిండేలా ఒక్కసారి ముద్దిడాలని ఉంది ! * * * ఒక్క సారి హత్తుకోవాలని ఉంది పెను తుపానుకు వెరువక ధరణి మేను కరుచుకునే గడ్డి పరకలా ధైర్యంగా ఆలంబనై అల్లుకునే ఎదను నిశ్చింతగా ఒక్క సారి హత్తుకోవాలని ఉంది ! * * * ఒక్కసారి జీవించాలని ఉంది తను కరుగుతూ నలుదెసలా వెలుతురు నింపే కొవ్వొత్తిలా కనుమరుగవుతూ కాంతిని పంపే చీకటిలా స్వార్ధాల అర్ధాలన్నీ చిదిమేసి ఒక్కసారి తరించాలని ఉంది . . ! * * * ఒక్క సారి బ్రతకాలని ఉంది మరచిపోయిన స్పందనలన్నీ సజీవంగా ఎదురొస్తే తెరలు పొరలు . . అహాలు అడ్డుగోడలు దాటేసి మనసున్న మనిషిలా.. ఒక్కసారి.. ఒక్కసారి బ్రతకాలని ఉంది . .! నిర్మలారాణి తోట ( తేది: 03.05.2014 )

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i4CQm2

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి