ఎండ కాస్తుంది అంటే మాటవుతుంది... పేద వాడి కాలే కడుపులాగా విప్లవ వాది మండే గుండె లాగా ఎర్రటి ఎండ ప్రచండంగా నిప్పులు చెరుగుతోంది అంటే కవిత్వమవుతుంది వెన్నెల కాస్తుంది అంటే మాటవుతుంది పక్షం రోజులు పురిటి నొప్పులు పడి పున్నమి..వెన్నెలను ప్రసవించింది అంటే కవిత్వం అవుతుంది ఏమిటో ? అక్షరాల్ని లక్షణంగా లక్ష్యం దాకా తీసుకెళ్తే చాలనుకున్నా.. కాదు.. అక్షరాన్ని వంగ పెట్టి, సాగదీసి మెలిపెట్టి, వీలైతే రెండు మూడు భాషలు కలగలిపి మామూలు మనసుకు అంతుబట్టకుండా మేధావుల మెదడుకు మాత్రమే అర్ధమయ్యేలా వ్రాయగలిగితేనే గొప్ప కవిత్వం ! అమ్మ కడుపు నుంచి అపుడే పుట్టినంత స్వచ్చంగా కలం ప్రసవించిన అచ్చ తెలుగు అక్షరాలను కాగితం పొత్తిళ్ళలో పరిస్తే చాలనుకున్నా . . కాదు. . పదాలకు పదును పెట్టి, సానబెట్టి, కాసింత తేనె పూసి, సాములు చేసి అందాల్ని, ఆనందాల్ని తెర వెనక్కి తోసేసి మాంసపు ముద్దల్ని మాటలుగా చేసి రక్తపు మరకల్ని, చురకల్నీ చుర కత్తులుగా చేసి గుండెల్లో గుబుల్లూ, సెగలూ కళ్ళల్లో పొగలూ, కన్నీళ్ళూ తెప్పించగలిగితేనే గొప్ప కవిత్వం ! నేనింకా పసి కూనని అక్షరాల పొత్తిళ్ళలో హత్తుకునే మెత్తదనమే తెలుసు మాటల మాధుర్యాలను ఆలకించి చిందే మమతల బోసి నవ్వులే తెలుసు అమ్మ వేళ్ళ కదలికల కవితల కితకితలే తెలుసు రంగుల్ని, వెలుగుల్నీ చూసి కేరింతలే తెలుసు ఆకలేస్తే చీమ కుడితే ఓ క్షణం ఏడ్చి మరచిపోవడమే తెలుసు ఎదురు నిలవడం , గళమెత్తడం తెలియదు నిలదీయడం నిగ్గు తేల్చడం తెలియదు లయ బద్దంగా నవ్వడం రాగ రంజితంగా ఏడ్వడం ఇంకా నేర్చుకోలేదు . . బుడి బుడి నడకల పసి పాదాలకు ముళ్ళో, రాళ్ళో తగిలితేనో , దారులే మూసుకు పోతేనో నెమ్మది నమ్మదిగా నేర్చుకుంటా పదాల పేరడీ మాటల గారడీ..! ఎ..ద..గా..లి కదా. . . ! ! నిర్మలా రాణి తోట [ తేది: 17.06.2014 ]
by Nirmalarani Thota
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ydAsQZ
Posted by Katta
by Nirmalarani Thota
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ydAsQZ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి