+1/-1
చిన్నప్పుడు
లెక్కలంటే భలే సరదా నాకు
కూడికలంటే చేగోడీలు తిన్నంత ఇష్టం
తీసివేతలు పచ్చిబాదం కాయల్లా వగరు
ఇప్పుడో
తినే ముందు తీసేయక తప్పని బెడ్డలు తీసివేతలు
కూడికలంటే తేలికే కానీ తెలీని అదో చిన్నచూపు
అంకెలు అప్పచ్చుల్లా నొరూరించేవప్పట్లో
సంఖ్యల్లా వాటిని పెంచమంటే
ఖాళీఅగ్గిపెట్టల్ని రైలు బండిగా మార్చడమంత హుషారు
ఇప్పుడో
ఏ చుట్టం కంటపడ్డా పక్కిట్లో నుంచి అప్పుతెచ్చుకోడానికొచ్చిన చిన్నంకెను చూసినంత చిరాకు
2x1=2
2x2=4
ఎక్కాలు పైకీ కిందకీ…కిందకీ పైకీ గుక్క తిప్పుకోకుండా వప్పచెప్పక పోతే పడేది వీపుమీద మాసారు పిడిగుద్దు
మా ఐదో అంతస్తు ఫ్లాటుకు ఇప్పుడెన్నివందల సార్లు ఎక్కిదిగుతున్నానో చెప్పద్దు
3x3=9
హెచ్చవేతలంటే చెయ్యి వెచ్చబడేదే గానీ
చేస్తున్నకొద్దీ ఉత్సాహం రెట్టింపయ్యేది
మొక్క చెట్టవడానికి పాదుల్లో నీళ్ళు పోస్తున్నంత ఉల్లాసం ఆ పిచ్చి వయసది
ఇప్పుడో
బ్యాంకుడబ్బు వడ్డీలెక్కలప్పుడు తప్ప గుణకారమంటేనే వళ్ళుమంట
1033/7
భాగహారం చెయ్యాలన్నా భలే భయం బాబూ ఆ రోజుల్లో!
పదొందలముప్పైమూడులో ఏడు ఎన్ని సార్లు పోతుందో తెలీక ఏడుపు
సున్నా శేషంగా వచ్చిందా పరుగుపందెంలో కప్పుగెల్చినంత ఆనందం
పదహారు నుంచి అరవైఆరునైనా సరే
ఎన్ని సార్లైనా పంపించగల గడుసుదనం ఇప్పటిది
0
సున్నా అంటే ఏమీలేదనుకునే ఆమాయకత్వం ఆ చిన్నతనానిది.
సున్నాలోనే అన్నీ వున్నాయని అర్థమయిన పెద్దమనిషిత్వం ఇప్పటిది.
లెక్కలంటే మేథకు తొడిగిన రెక్కలు ఒకప్పుడు
లెక్కలంటే కాకులైనా చేయగల ట్రిక్కులు నాకిప్పుడు.
07-09-2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి