పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

జిలుకర శ్రీనివాస్ కవిత


మబ్బులు అలిసిపోయి భూమ్మీదికి వొంగాయి ముత్యాలు కాలువలో పారుతున్నాయి మెరుపుల్ని చూస్తె చాలు కంటికి చీకటి తప్ప మరేదీ కనిపించని ఆ వాన రాత్రి మా బాపుని చేతిలోకి తీసుకొని కన్నా తండ్రిలా నడిపించిన నా లేత పాదాలే బురదలో మెరుస్తాయి ఒక్కసారి ఆకాశం బద్దలైన పెద్ద శబ్దం విని ఎప్పుడూ భయపడని బాపు నా చేయి పట్టుకొని వోనికిపోతూ గావుకేక పెట్టినప్పుడు నా గుండె మీద తొలిసారిగా పిడిగు రాలింది మొగులు ఉరిమిన ప్రతిసారి మా బాపు బెదురు కళ్ళే గుర్తొస్తాయి ఏం కాదు బాపు భయపడకని చెప్పిన నా మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తాయి గోరీలో నిద్దరోతున్న మహా జ్ఞానిని ఒక్కసారిగా నిద్రలేపి మాట్లాడాలనిపిస్తాది

మా తాతలు నడిచిన ముద్రలిక్కడే ఇంకా చెరిగిపోకుండా ఉన్నాయి వాటిని మా నాయిన కల్లకద్దుకొని కాపాడుకున్నాడు మా గుండెల మీద వాటిని చెరగని గుర్తులుగా చెక్కిపోయాడు తవ్వండి సమాధులను రాక్షస గుళ్లని మీరు హేళన చేసినవి మా పూర్వీకుల ఆనవాళ్ళు పురాతత్వ శాఖ మూగతనం వెనక ఎన్ని కుట్రలున్నాయో మాకు తెలుసులే. మా చరిత్ర మట్టిపోరాల కిందే మగ్గి పోవాలని కదా మీ కుతంత్రం చెరిపేస్తే చెరిగి పోవడానికి అదేమన్నా మీరు రాసిన అబద్దపు కారు కూతలనుకున్నారా? వేల ఏళ్ళ తర్వాత కూడా రంగు వెలువని మట్టి కుండలు తయారు చేసిన జాతి మాది తవ్వుకుంటాం పూర్వీకుల నెత్తురు పారిన చోట వెలిసిన మీ సింహసానాల ఒక్క తన్నుతో పడదోస్తాం! రాలుతున్నవి చినుకులు కావి తమ్ముడా మనల్ని చూసి మన తాతలు నవ్వితే తొణికిన కన్నీళ్లు

మబ్బులు తొలిగిపోక తప్పదు నల్లని బండల మీద నక్షత్ర పుంతలు చెక్కిన మూలవాసుల ఆశలు ఈ దేశ శిరస్సు మీద తలతలా మెరవక తప్పదు ఈ నేల మీద నాగరికతను నాటిన జాతి గర్వంతో పాలకులవ్వక తప్పదు మా అయ్యా కాన్షీరాం మనువు తల మీద కాలు మోపి తొక్కి చంపక తప్పదు శవాలు మాత్రమే నడుస్తున్న ఈ మనుభూమిలో మనిషి తిరిగి పుట్టక తప్పదు బుద్దుని శిగలోని చాందిని నవ్వక తప్పదు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి