పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, ఆగస్టు 2012, గురువారం

జిలుకర శ్రీనివాస్||కవిత||


చేపకి ఈదొద్దని నెమలికి ఆడొద్దని కోకిలకి పాడొద్దని పిట్టకి ఎగరొద్దని పిల్లాడికి ఏడ్వొద్దని నాకు నీతో మాట్లాడొద్దని షరతులు పెడితే అది ప్రక్రుతి విరుద్ధమని తెలుసు కదా!
ఎంత ఉగ్గపట్టుకున్నా గుండె సొద ఆగదు నిన్ను తలుచుకోగానే రెండు నల్లని రాత్రులు ఒక్కసారిగా వెలుగుతో మెరిసిపోతుంటాయి చాల్లే! నీ మాటలు నాకేమీ అర్థం కాటం లేదని కదా! నువ్వు నా మాటల్ని తుడిచేస్తుంటావు.

నిన్న రాత్రంతా ఒకటే నెత్తురు కన్నుల్లో! అస్సాం నిండా తెగిపడిన నా తలలే రూమీ టోపీలన్నీ కాలిపోతున్నాయి నీ ఒంటిని కప్పుకున్న బుర్ఖా చించి నీ మొహం మీద పదునైన కత్తులతో తవ్వుతున్న చప్పుడు చెవుల నిండా! తెగిపడిన నా చేతులు నీ ప్రాణాన్ని కాపాడాలని పెనుగులాడుతున్నాయి ఎక్కడి నుండి వచ్చిందో అంత తెగింపూ బలమూ నెత్తురోడుతున్న నీ దేహాన్ని ఆయుధంగా మలిచి ఒరిగిపోతున్న నన్ను కాపాడుతున్నావు! ఎంత దయగలదానివి ఎంత ప్రేమగలదానివి నిన్నెలా చంపాలనుకున్నారు? కలలింత రక్తం ఒలికితే నిద్రెట్లా పోయేది?


ఎన్ని అక్షరాలు నీ ముందు గుమ్మరించినా ఒక్కటీ అర్థవంతమైన సొగసివ్వటం లేదు
వాక్యాన్ని ఎన్ని ముక్కలు చేసినా నిన్ను చేరగల మెరుపును పుట్టించ లేకపోతున్నా
కవిత్వాన్నీ నిన్ను మెప్పించటం నా తరం అయిత లేదు సరె పో! నేను అంత వీజీగా ఓడిపోతానా మిమ్ముల వొదులుతానా!

*08-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి